calender_icon.png 19 November, 2024 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల ప్రక్షాళన తప్పనిసరి

29-06-2024 12:00:00 AM

కల్పనా చౌదరి కొల్లి :

‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఒకప్పటి మాటలాగా అయిపోయింది. సనాతన ధర్మం, దాని విలువల గురించి ఎంత చెప్పినా దేవాలయాల పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఒకప్పుడు భగవంతుడికి, భక్తునికి మధ్య దూరం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు దేవుడిని చూడాల న్నా, తాకాలన్నా అనుమతులు కావాలని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితులకు ముఖ్య కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తే, ఆలయాలను పరిరక్షించాల్సిన అర్చకులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, దాతలు ఇచ్చిన సహకారం పక్కదారి పట్టడం, సరైన వసతులు కల్పించకపోవడం, ఆలయాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి.

శ్రీశైలం, యాదగిరిగుట్ట, కనకదుర్గమ్మ, తిరుపతి లాంటి ప్రసిద్ధ దేవాలయాల్లో సైతం కనీస వసతులయిన తాగునీరు, అన్న ప్రసాదం వంటివి కూడా కల్పించక పోవడం వల్ల దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయాల్లో సౌకర్యాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.

సామాజిక మాధ్యమాల ద్వారా ఆలయాల విశిష్టతను, హిందుత్వం,  సనాతన ధర్మం గురించి అవగాహన కల్పించడంలో మనం కాస్త ముందంజలో ఉన్నామనే చెప్పవచ్చు. కానీ, ఇదే తరహాలో దేవాలయాలలో వసతులు పెంచి భక్తునికి, -భగ వంతునికి మధ్య దూరం తగ్గించి దళారుల చేతిలో మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టికెట్ ధర ఎంత ఎక్కువ ఉన్నా కొనుక్కొని క్యూలైన్‌లో నిలబడితే భగవంతుడు ఎప్పటికి దర్శనం ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు దేవాలయాల పరిరక్షణ, పర్యవేక్షణ, ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. భక్తుడు గుడికి వెళ్ళిన వెంటనే దర్శనం అయ్యేలాగా చూడాలి. లేదంటే ప్రయా ణం రిజర్వేషన్లలాగా దేవాలయాలకు వెళ్లడానికి రిజర్వేషన్లు, పర్మిషన్లు తీసుకోవా ల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పెరిగిన జనాభాతో పరిస్థితి ఇలా ఉంటే, పెరగబోతున్న జనాభాతో మున్ముందు మంరింత దయనీయ పరిస్థితి నెలకొంటుందని అంచనా.

ఆలయాల ఆవరణలో అమ్మే ఆహార పదార్థాల మీద కూడా కఠిన నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫు డ్ లాంటివి అరికట్టాలి. సాంప్రదాయ ఆహార పదార్థాలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచేలా చూడాలి. గత పదేళ్లుగా ఆలయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం, గుడి ఆవరణలో పర్యావరణానికి హాని చేసే వివిధ రకాల వస్తువుల వాడకం లాంటి వాటితో దేవాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారి పోయింది. అక్కడి ప్రమాణాలు మెరుగు పరచడంలో బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యపడదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రాచీన ఆలయాలు చాలా ఉన్నాయి. అయినా, దర్శనానికి ఎక్కువ సమయం పట్టదు. కొన్ని ఆలయాల్లో టికెట్స్ కూడా ఉండవు. 

రాజకీయ జోక్యాలు నివారించాలి

దేవాలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం అనేది పెద్ద సమస్యగానే చెప్పుకోవాలి. చాలావరకు అన్ని ఆలయాలు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వస్తాయి. వాటి నిర్వహణలో రాజకీయ, అధికార జోక్యం కారణంగా  నిర్వహణ లోపం, అవినీతికి దారి తీస్తోంది. ఆలయ బోర్డులు, కీలక పదవులకు రాజకీయ నియామకాలవల్ల అర్హత లేని వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతోం ది. ఇది ఆలయ పరిపాలనను మరింత క్లిష్టతరం చేస్తోంది. ఇక ఆలయ నిధుల దుర్వి నియోగం ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత అవసరం. సరైన ఆడిటింగ్ యంత్రాంగాలు లేకపోవడం వల్ల ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి.

అనేక దేవాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నా యి. ఫలితంగా నిర్మాణాలు క్షీణించడం, భక్తులకు సరిపడా సౌకర్యాలు లేక  అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురా తన దేవాలయాల పునరుద్ధరణకు తరచూ నిధుల కొరత ఉంటోంది. ఇది సాంస్కృతిక వారసత్వ క్షీణతకు దారితీస్తుంది. కొన్ని దేవాలయాలు మారుమూల ప్రాంతాల్లో ఉండడం, వాటిలోని విలువైన కళాఖండా లు విధ్వంసానికి గురి కావడం, అపహరించడం జరుగుతోంది. చాలా దేవాల యాల్లో సరైన భద్రతా చర్యలు లేవు. మతపరమైన, సాంస్కృతిక విలువలను నీరు గార్చి వీఐపీ ట్రీట్‌మెంట్లపై అధిక దృష్టి పెట్టడం వంటివి ఆధ్యాత్మిక వాతావరణాన్ని దూరం చేస్తున్నాయి. ఆధునీకరణ అనివార్యమైనా, ఆచారాల పరిరక్షణ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితు ల్లోనూ రాజీ పడకూడదు.

పలు ఆలయాల భూములు తరచుగా పలువురు వ్యక్తులు లేదా సంస్థల ఆక్రమణలకు గురవుతున్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇది చట్టపరమైన వివాదాలకు, ఆస్తి నష్టానికి దారి తీస్తోంది. ఆలయ భూముల నిర్వహణకు ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ఆదాయాన్ని ఆలయ పునరుద్ధరణకు, మౌలిక సదుపాయాల కల్పనకు, భక్తుల సౌకర్యాలకు ఉపయోగించడం  ఎంతయి నా అవసరం.

క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

భక్తుల రద్దీ ఉండే ఆలయాల్లో పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన ఒక పెద్ద సవాలు అనే చెప్పుకోవాలి. టాయిలెట్ సౌకర్యాల కొరత వంటివి భక్తులకు ఇబ్బందులతోపాటు స్థానికులకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. చాలా ఆలయాల్లో భక్తులకు వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు లేవు. ప్రముఖ ఆలయాల్లో పండుగలు, సెలవుల రోజుల్లో రద్దీని నిర్వహించడంలో  సిబ్బంది విఫలమవడం చూస్తూ ఉన్నాం. తోపులాటలు సర్వసాధారణమవుతున్నాయి. ‘దర్శనానికి ఎందుకు వచ్చామా?’ అని చింతించ వలసిన పరిస్థితులు అనేకం. ఇది భక్తులకు గందరగోళం, అసౌకర్యానికి దారి తీస్తుం ది.

క్యూ లైన్ల క్రమబద్ధీకరణ విషయంలో ఆలయాల సిబ్బంది, అధికారులు విఫలమవుతున్న సందర్భాలే అధికం. ఆలయా ల పరిసరాల శుభ్రత మరో పెద్ద సమస్యగా మారింది. పర్యావరణ క్షీణత, కాలుష్యానికి సంబంధించిన సవాళ్లను కూడా పలు ఆలయ పట్టణాలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో వేస్ట్ మేనేజ్‌మెంట్ సమస్యలు సైతం ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం, ఇతర వ్యర్థాలు తరచు గా ఆలయ ప్రాంగణంలో, చుట్టుపక్కల కోనేర్లు, నదుల్లో పేరుకు పోయి నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థను కలిగి ఉండడం దేవాలయాల ప్రధాన కర్తవ్యం. 

ప్రత్యేక సౌకర్యాలు

దివ్యాంగులకు, వృద్ధులకు, మహిళల కు ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు అనుకూలమైన వ్యవస్థను కల్పిం చడం, వారికి ప్రత్యేకమైన క్యూలైన్లు, వేచి ఉండే గదులను సమకూర్చడం ఎంతో అవసరం. దేవాలయ పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటడం, వాటిని కాపాడడం చాలా అవసరం. ఆలయ ప్రాంగణంలో, చుట్టుపక్కల అనధికార విక్రయదారులు, యాచకులు భక్తులకు ఇబ్బందిని కలిగిస్తుంటారు. ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతా వరణాన్ని దూరం చేస్తుంది. ఇలాంటి వాటిని నివారించాలి.  అనేక ఆలయాల్లో పురాతన కళాఖండాలు, విగ్రహాలు, శాసనాలు వంటివి ఉన్నాయి. వీటి నిర్వహణ, సంరక్షణ తప్పనిసరి. సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అమూల్యమైన సాంస్కృతిక వారసత్వం క్షీణించిపోతోంది.