‘రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి’అనేది నానుడి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకూ ఇది వర్తిస్తుందేమో. కాల గమనంలో సంఘాల జెండా అజెండాలు మార్చి, సంఘాల ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఉద్యోగ నాయకులు కాస్తా, రాజకీయ అవతారాలకు ఎగబడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఖద్దరు చొక్కా కోసం పాకులాడటం కనిపిస్తుంది.
‘కండువా లేని పార్టీల కార్యకర్తలు’ అనే మచ్చ కూడా పడింది. ‘ప్రభుత్వాధినేతలకు క్షీరాభిషేకాలు’ దురదృష్టకరమే.
కెంపుల నాగరాజు
నాయకుల స్వార్థ ప్రయోజనాలకు సభ్యులను మోసం చేయడం ఘోర తప్పిదమే. సంఘాన్ని తాకట్టు పెట్టి, పదవులు పొందుతున్న ఘనులెందరో ఉన్నారు నేడు. ఎంతటి దీనస్థితి. మరెంతటి అపఖ్యాతి. హక్కుల కోసం ఆనాడు ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రినే ఎదిరించిన సంఘాలా ఇవి? పెన్ డౌన్ నిరసనకు దిగిన నాయకులేనా వీళ్ళు? తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకత్వం ఇప్పుడు ఎటుపోయిందో అనిపి స్తుంది. సంఘ శ్రేయస్సు విస్మరించిన అందరిలోను రాజకీయ కాంక్షనే. ఫలితమే చరిత్ర హీనులుగా పేరు గడింపు. స్వంత సభ్యులచే ఛీత్కారాలు. నిరసనలకు సభ్యులను తరలించలేని దుస్థితి. సంఘానికి మద్దతు పొందలేని దయనీయం. సంఘ నాయకులు కోరుకున్న పార్టీలకు వ్యతిరేకంగా సభ్యులు పని చేసే దౌర్భాగ్యం. సంఘాల భవితవ్యమే ప్రశ్నార్థకం. సంఘ వైభవాలు ఇక ‘గత గుర్తు లేనేమో’ అనే దుస్థితి? మరోవైపు ప్రభుత్వం మారినందున పరిస్థితుల్లో మార్పు వస్తుందనే ఆశ ప్రభుత్వోద్యోగులది.
సీఎంతో ఆత్మీయ సమావేశం
‘సాధారణ ప్రభుత్వోద్యోగుల మొర ఆలకించారేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అన్నట్టు ఈనెల 11న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో అయన ‘ఆత్మీయ సమ్మేళనం’ పెట్టారు. ప్రభుత్వ గుర్తింపు సంఘా లతోపాటు రిజిస్టర్డ్ సంఘాలకూ ఆహ్వా నం పలికారు. సీఎం పిలిచారని హుషారుగా వెళ్లిన నాయకులకు, సూటిగా కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. లోటు బడ్జెట్‌లోను ఒకటో తారీకునే జీతాలు ఇస్తున్నామని చెబుతూనే, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని మాటిచ్చారు. పీఆర్సీ, ఓపీఎస్‌లపై ఆశలు కల్పించారు. అదే సమయంలో నలుగైదుగురితోనే నిర్వహిస్తున్న నాయకుల సంఘా లకు ఇక విలువ ఉండబోదన్నట్టు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సం ఘాలకు సైతం అంతర్లీనంగా చురకలు అంటించారు. వివిధ ప్రభుత్వ శాఖల కు గుర్తింపు సంఘాలు ఉండాలని, ప్రభు త్వం వాటితోనే సమావేశాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. అంటే, అన్నింటికీ మే మేనని చెప్పుకునే సంఘాలకు చెక్ పెట్టారనే అర్థం.
కీలక వ్యక్తులకు బాధ్యతలు
గత కొన్నేళ్లలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయ పావులు కదిపారనవచ్చు. ఇది కొన్ని పెద్ద సంఘాలకు శరా ఘాతమే. ఎలాంటి ఎన్నికల ప్రక్రియ లేకు ండా అప్పనంగా ఆన్ డ్యూటీ (ఓడీ) సౌక ర్యం అనుభవిస్తున్న సంఘాల గొంతు లో అయన పచ్చి వెలక్కాయ వేసినట్టే. సునిశితంగా పరిశీలిస్తే, ఖద్దరు చొక్కా కోసం పరితపిస్తున్న ఉద్యోగ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టి దెబ్బ కొట్టారు. ఉద్యోగ సంఘాలను ప్రక్షాళన చేసేలా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చర్యలు. ప్రతిపక్షంలో తాను చూసిన ఉద్యో గ సంఘాలను, వాటి పరిస్థితులను మా ర్చాలనే కంకణం కట్టుకున్నట్టు ఆయన అగుపిస్తున్నారు. కానీ, ఎక్కడా దీన్ని కనిపించనీయడం లేదు. పక్కాగా ప్రణాళిక అమ లు చేస్తున్నట్టున్నారు. రాష్ట్ర ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజకీయ జేఏసీ చైర్మన్, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రాంలకు కీలకమైన ఉద్యోగ సంఘాల బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి వారధులుగా వీరిని నియమించారని తెలుస్తున్నది. సీఎం న మ్మినబంటులు కాబట్టే, వీరికి ఈ బాధ్యతలు. ఆయన పదవీ విరమణ పొందిన ప్ర భుత్వ ఉద్యోగి. తెలంగాణ ఉద్యమంలో ఉ ద్యోగ సంఘాలను సైతం నడిపించిన వ్యక్తి.
ఆ నాయకులకు విలువ వుండదు
సంబంధిత శాఖ సమస్యలు ఆ శాఖ నాయకులే ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే నాయకులకు విలువ లేకుండా పోతుంది. అందుకే, సాధారణ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో కేంద్రీకృతమైన నాయకత్వాన్ని వికేంద్రీకరణ చేసేలా, నాయకత్వం కొందరి చేతుల్లో లేకుండా అందరి హస్తాల్లో ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారని కొనియాడు తున్నారు. కొన్ని సంఘాల నాయకుల గుండెల్లో మాత్రం అప్పుడే గునపాలు దిగుతున్నాయి. ఎక్కడ పెట్టి తొక్కాలో అక్కడ పెట్టి తొక్కాడని హైరాన చెందుతున్నారు.
ఉద్యోగుల్లో కొత్త ఆశలు
దేనిని ఎక్కడ పెంచాలో, ఎక్కడ తుంచాలో అన్నట్టు ఉద్యోగ సంఘాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్లడం సాధారణ ఉద్యోగుల్లో కొత్త ఆశలు మొలకెత్తిస్తున్నది. సంఘాల స్వార్థ నాయకుల్లో మాత్రం అలజడి రేపుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు కొత్త చిక్కులు వచ్చి పడేలా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 3 నవంబర్ 2022న వెలువరించిన జీవో 2069 ప్రకారం ప్రస్తుతం 11 గుర్తింపు సంఘాలు ఉన్నాయి. ఇందులో టీఎన్జీవో, తెలంగాణ సచివాలయ, రెవెన్యూ, నాల్గో తరగతి ఉద్యోగ సంఘాలే పరిపాలన విభాగానికి చెందినవి. మిగతా ఆరు బోధనా వృత్తికి చెందిన ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు ఏడాదంతా ఆన్ డ్యూటీ లభిస్తుంది. వీరు విధులకు హజరు కాకుండా సంఘ కార్యకలాపాలకు వెళ్ళవచ్చు. అయినా, అన్ డ్యూటీ సౌకర్యం కింద జీతం లభిస్తుంది. సీఎం తాజా ఆలోచన ప్రకారం ప్రతీ శాఖకు గుర్తింపు సంఘం ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన 33 ప్రభుత్వ శాఖలకు 33 గుర్తింపు సంఘాలు ఏర్పడుతాయి. అప్పుడు అన్నింటికీ మేమేనని చెప్పుకుని తిరిగే సంఘాలకు సంకటం తప్పదు.
పైరవీకారుల ఆటలు సాగవు
ఇకపై తమ పైరవీలు, ఇష్టారాజ్యం సాగదనే ఆందోళన వారి లో కనిపిస్తుంది. ఖద్దరు చొక్కా కలగానే మిగులుతుందా? కాదం టే, ఉద్యోగం వదిలేయల్సిందేనా? రెండు పడవలమీద ప్రయాణం ఇక ప్రమాదమేనా? అంటూ లోలోన కుమిలిపోతున్నారు. అయితే, ఆర్టీసి, సింగరేణి సంస్థ ల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి, గెలిచిన సంఘాన్ని ప్రభుత్వ గుర్తింపు సంఘంగా ప్రకటించే ఆనవాయితీ ఉంది. మరి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు గుర్తింపు సంఘం ఎలా ఇస్తారో చూడాలి. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి, గెలిచిన సంఘానికి గుర్తింపు ఇస్తే మాత్రం సంఘాల ప్రక్షాళన ఖాయం. ఎందుకంటే, స్వార్థ ప్రయోజనాలకు పోతే ఆ సంఘా న్ని ఉద్యోగులు ఓడిస్తారని భ యం. అందుకే, తప్పులు చేయకుండా సంక్షేమం, హక్కులు, డిమాండ్ల సాధనకు నాయకులు పనిచేసే ఆస్కారం ఉంటుంది. బ హుశా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన ఇదే కాబోలు. చూడాలి మరి, రానున్న రోజుల్లో ఏం జరగనుందో.
(వ్యాసకర్త జిల్లా అధ్యక్షులు,
తెలంగాణ ఎంప్లాయీస్
అసోసియేషన్, నిజామాబాద్)
సెల్: 9989075383