డాక్టర్ తిరుణహరి శేషు :
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత తరచూ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని, అందుకు హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణ అమ్ముల పొదిలో ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ ఒక గ్రోత్ పిల్లర్‌గా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచటానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నగరాభివృద్ధికి పదివేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
హైదరాబాద్‌ను మూడు జోన్లగా విభజించాలని, ది ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ స్లోగన్ తో ఫోర్త్ సిటీని నిర్మించడంతోపాటు (నెట్ జీరో సిటీ) నగరాన్ని కాలుష్య కోరల నుండి బయటపడేయ టానికి మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ బోర్డ్ ఏర్పాటుచేసింది. దీనితో పాటు హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు నుండి కాపాడి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడానికి ‘హైడ్రా’ లాంటి స్వతంత్ర ఏజెన్సీని ప్రభు త్వం ఏర్పాటు చేసింది.
ప్రజల నుండి ఎందుకు వ్యతిరేకత?
‘హైడ్రా’ లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ ఆక్రమణల తొలగింపు, కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ప్రజలనుండి హర్షం వ్యక్తం అయింది. ఎన్ కన్వెన్షన్ లాంటి వ్యాపార సంస్థలను కూల్చివేసినప్పుడు, ఫామ్‌హౌస్‌లను, ఎఫ్‌టిఎల్‌లో నిర్మాణం చేపట్టిన విద్యాసంస్థలను కూల్చాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడు ‘హైడ్రా’ పని తీరుపై ప్రశంసలు రావటమే కాదు ఇలాంటి ఏజెన్సీలను ఇతర నగరాలకు, పట్టణాలకు కూడా విస్తరించాలనే ప్రతిపాదనలు ప్రజల నుండి వచ్చాయి.
కానీ ‘హైడ్రా’ కూల్చివేతల విస్తృతి పెరగటం, సున్నం చెరువు, బెస్తం చెరువు, దుర్గం చెరువుల ఎఫ్‌టిఎల్ లో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసే సందర్భంలో ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైందనే చెప్పాలి. ఒకవైపు ‘హైడ్రా’ అక్రమణల తొలగింపు, మరొకవైపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన, రివర్‌బెడ్‌లో ఉన్న ఇళ్లను తొలగించడానికి మార్కింగ్,కూల్చివేతలు ప్రారంభం కావడంతో నదీ గర్భంలో ఇళ్లు నిర్మించుకున్న వారి నుండి ప్రభుత్వానికి ప్రతిఘటన ఎదురైంది.
మూసీరివర్ బెడ్‌లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలు ఎక్కువగా ఉండటం, వారి జీవనాధారమైన గృహాలను ప్రభుత్వం తొలగించడానికి సిద్ధపడటంతో ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొక తప్పలేదు. ఎప్పుడైతే రివర్‌బెడ్ లో నివాసముంటున్న ప్రజల నుండి ప్రభుత్వ చర్యల పట్ల వ్యతిరేకత మొదలైందో రాజకీయ పక్షాల ప్రవేశంతో వివాదం మరింత ముదిరిందనే చెప్పాలి.
ప్రభుత్వం ఒకేసారి హైడ్రా కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేపట్టటం, అధికారులు సరైన ప్ర ణాళికలు రూపొందించుకోకపోవడం, రివ ర్ ఫ్రంట్‌లో ఉన్న పేదలను అక్కడి నుండి ఖాళీ చేయించడానికి అధికారులు ప్రజలను మానసికంగా సిద్ధం చేయకపోవడంతో ప్రభుత్వం ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తున్నది.
దక్షిణ కొరియా రాజ ధాని సియోల్ నగరం నడిబొడ్డులో ప్రవహించే చియాంగే చియాన్ నదిని, లండన్ లో థేమ్స్ నదిని అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి నష్టం, ఇబ్బందులు వాటిల్ల కుండా ప్రక్షాళన చేయగలిగినాయి. మనదేశంలో సబర్మతి నదీ ప్రక్షాళన జరిగినా, మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘నమామి గంగే’ పేరుతో గంగా నది ప్రక్షాళన చేయలేకపోయారు.
కానీ మూసీ రివర్ బెడ్ ప్రక్షాళన వలన 10,600 మంది నిర్వాసితులు అవుతారని, రివర్‌బెడ్‌లో ఉ న్న 1600 ఇళ్ళను తొలగించాలని ప్రభుత్వ మే చెబుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మూసీ నిర్వాసితులకు ప్రభు త్వం ఇస్తున్న నష్టపరిహారం ఆమోదయోగ్యంగానే ఉన్నది కానీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏమిటంటే నిర్వాసితుల తరలింపునకు వారిని మానసికంగా సిద్ధం చేయకపోవడం, ప్రజల భయాందోళనలను నివృత్తి చేసే ప్ర యత్నం ప్రభుత్వం వైపు నుండి, అధికారుల వైపు నుండి జరగకపోవటం, నిర్వాసిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరో సా ఇవ్వకపోవడంతో వారినుండి ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది.
హామీగానే మిగిలిపోయిన మూసీప్రక్షాళన
గత మూడు దశాబ్దాల కాలంగా ప్రతి ఎన్నికలో రాజకీయ పార్టీలు మూసీ ప్రక్షాళన చేస్తామనే హామీని ఇస్తున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలు మూసీ ప్రక్షాళన కోసం హడావుడి చేశాయే కానీ ప్రక్షా ళన చేయలేకపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యక కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ మూసీలో నీళ్లు కొబ్బరినీళ్లులాగా మెరవాలి, మూసీలో హుస్సేన్ సాగర్ లో రూపాయి బిళ్ళ వేస్తే తళ తళా మెరిసే విధంగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
కానీ నాటి ముఖ్యమంత్రి హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు మూసీ నదిలో కలవడం వలన హైదరాబాద్ లోని భూగర్భ జలాలు కలుషితం కావటమే కాకుండా మూసీ నది నీళ్లు ఏ విధంగానూ పనికిరాకుండా పోయినాయి మూసీ పరీవాహకం మొత్తం దుర్గంధం వెదజల్లడమే కాదు నల్గొండ జిల్లా ప్రజల తాగు నీరుపై, వ్యవసాయ పంట పొలాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపెడుతున్నది.
మూసీ ఒకవైపు పర్యావరణాన్ని దెబ్బతీస్తుంటే మరొకవైపు నదిచుట్టూ ఆక్రమణలతో పెద్ద ఎత్తున మురికివాడల ఏర్పాటుతో మూసీ హైదరాబాద్‌కు ఒక పెద్ద గుదిబండగా మారిందనే చెప్పాలి. మూసీ రివర్ ఫ్రంట్ లో నివసిస్తున్న పేదల ఆరోగ్యాలపై కూడా దానికాలుష్యం ప్రభావం చూపెడుతున్నది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలన్నా, మురికి కూపం నుండి బయట పడవేయాలన్నా మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగా సాగాలి దానికి ప్రభుత్వానికి ప్రజలు, పార్టీలు పూర్తిగా సహకరిస్తేనే సాధ్యమవుతుంది.
ముసురుతున్న రాజకీయం
మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం తన అధికా రం, చట్టాలను ప్రయోగించటం కంటే నిర్వాసితులను ఒప్పించి ఖాళీ చేయించే బాధ్యత ను తీసుకోవాలి. మూసీ నిర్వాసితుల పక్షాన ప్రతిపక్షాలు అండగా నిలబడటాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రభుత్వం వారి నుండి కూడా సూచనలు, సలహాలు స్వీకరించాలి.
రివర్ ఫ్రంట్ లో ఉన్న ఆక్రమణలను తొలగించటానికి ముందే మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ఒక ప్రత్యేక కమిటీ వేసి నిర్వాసితులను ఒప్పించాల్సి ఉంది. కానీ నిర్వాసితుల నుండి వ్యతిరేకత ప్రారంభమైన తరువాత ప్రత్యేక కమిటీ వేయటం అంటే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ప్రభుత్వ వ్యవహారం ఉందనే భావన వ్యక్తం అవుతున్నది.
మూసీ నిర్వాసితుల ఆందోళన, వ్యతిరేకత వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, బుల్డోజర్ ప్రభుత్వంగా పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీలో కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నది. మధుయాష్కి లాంటి కాంగ్రెస్ సీని యర్ నాయకులు కూడా బహిరంగంగానే నిర్వాసితుల పక్షాన నిలవటం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే.
మూసీ ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పు పట్టలేము కానీ నిర్వాసితులను ఖాళీ చేయిస్తున్న విధానం సహేతుకంగా లేదన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. పేదలు కూడా మూసీ మురికి కూపంలో బతుకుతూ అనారోగ్యం పాలవుతారు కాబట్టి నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాలి.
ప్రతిపక్షాలు కూడా రాజకీయం కోసం గుడ్డి వ్యతిరేకతతో కాకుండా నిర్వాసితుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వాలను ఒప్పించే బాధ్యత తీసుకోవాలి. రాజకీయా లు ఎలా ఉన్నా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వం మానవ తా కోణంలో నిర్వాసితుల పట్ల వ్యవహరించాలి. మూసీ ప్రక్షాళన జరిగి హైదరాబాద్ నగరం కాలుష్య కూపం నుండి బయటపడి ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని కోరుకుందాం.
వ్యాసకర్త సెల్: 9885465877