calender_icon.png 28 November, 2024 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లూచిప్స్‌లో కొనుగోళ్లు

28-11-2024 12:00:00 AM

సెన్సెక్స్ 230 పాయింట్లు అప్

ముంబై, నవంబర్ 27: కొన్ని బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగడం, విదేశీ ఫండ్స్ తిరిగి పెట్టుబడులు చేయడం, అదానీ గ్రూప్ షేర్లు భారీగా కోలుకోవడం తదితర అంశాలతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిసాయి. బుధవారంనాటి ట్రేడింగ్ తొలిదశలో ఒడిదుడుకులకు లోనైన  బీఎస్‌ఈ సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్‌లో   507 పాయింట్లు పెరిగి 80,511 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరింది.

తదుపరి ముగింపులో కొంతమేర దిగిరావడంతో చివరకు 230 పాయింట్లు లాభంతో 80,234 పాయింట్ల వద్ద నిలిచింది. 24,354 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తుదకు 80 పాయింట్ల లాభంతో  24,275 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీల లాభాలకు ప్రధానంగా హెవీవెయిట్ షేరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తోడ్పడింది. ఈ షేరు 1.43 శాతం పెరగడంతో ఈ ఒక్కదానితోనే సెన్సెక్స్‌కు 167 పాయింట్ల లాభం కలిగింది.

బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,593 షేర్లు లాభపడగా, 1,335 నష్టపోయాయి. ఆరు వారాల నుంచి వరుస అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి నికర కొనుగోళ్లు జరిపారు. మంగళవారం రూ.1,158 కోట్లు, బుధవారం రూ.7.78 కోట్ల చొప్పున పెట్టుబడి చేసినట్లు ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

అదానీ పోర్ట్స్ టాపర్ 

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 6 శాతం పెరిగింది.  ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 1.5 శాతం వరకూ నష్టపోయాయి.

వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా యుటిలిటీ ఇండెక్స్ 3.11 శాతం ఎగిసింది. పవర్ ఇండెక్స్ 2.74 శాతం,  సర్వీసెస్ ఇండెక్స్ 2.53 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.35 శాతం, టెలికమ్యూనికేషన్ సూచి 1.17 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచి 1.13 శాతం చొప్పున పెరిగాయి.  ఐటీ ఇండెక్స్, రియల్టీ ఇండెక్స్‌లు తగ్గాయి.  బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.18 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం చొప్పున లాభపడ్డాయి. 

అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ

యూఎస్‌లో క్రిమినల్, సివిల్ కేసుల్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీలు ఆ కేసులపై వివరణ ఇవ్వడం, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి వ్యక్తిగత హోదాలో మీడియా సమావేశంలో ఈ కేసుల్ని విశదీకరించడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి.

అమెరికాలో యూఎస్ విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం కింద  అదా నీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై ముడుపులు చెల్లించారన్న అభియోగాలు నమోదుకాలేదని, సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్‌పై నమోదైన అభియోగాలు రుజువయితే జరిమానా చెల్లింపు మాత్రమే ఉంటుందంటూ అదానీ గ్రూప్ బుధవారం విడుదల చేసిన ప్రకటనతో ఆ గ్రూప్ షేర్లన్నీ ర్యాలీ చేశాయి.

అధికంగా అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ షేర్లు 20 శాతం మేర పెరిగాయి.  అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11. 56 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్‌డీటీవీ 9.35 శాతం, అదానీ పోర్ట్స్ 6.29 శాతం,  విల్మార్ 8.46 శాతం, అంబూజా 4.40 శాతం, అదానీ పవర్ 2 శాతం, సంఘి ఇండస్ట్రీస్ 4.73 శాతం పెరిగాయి.