05-04-2025 01:35:30 AM
కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
గజ్వేల్ కొనుగోలు కేంద్రంలో భారీ వర్షానికి తడిసిన పొద్దు తిరుగుడు
జిల్లా వ్యాప్తంగా 11,193 ఎకరాల్లో పంట సాగు
జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిలిచిపోయిన కొనుగోళ్లు
సిద్దిపేట, మార్చి 4 (విజయక్రాంతి) :పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులకు కొనుగోలు కష్టాలు తప్పడం లేదు. ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించిన రైతులకు ప్రభుత్వం ప్రోత్సహించకపోగా, ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతులకు శాపంగా మారింది. పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగు చేయాలని ప్రచారం చేసే ప్రభుత్వమే రైతులకు నష్టం కలిగిస్తుందని మండిపడుతున్నారు. నెల రోజులుగా గజ్వేల్, సిద్దిపేటలతో పాటు మరో నాలుగు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలలో రైతుల తమ పంటను ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
వ్యవసాయ అధికారులు నమోదు చేసిన పంట వివరాల మేరకు జిల్లాలోని ఏడు కేంద్రాలకు వచ్చిన పొద్దు తిరుగుడు పంటలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రమే అధికారులు కొనుగోలు పూర్తి చేశారు. రైతుల పండించిన మిగతా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రంలోనే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండిపోయింది. కనీసం గన్ని బ్యాగులు కూడా లేకపోవడంతో బస్తాలలో కూడా ధాన్యం ఎత్తి పెట్టలేక అలాగే కుప్పలుగా ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు విక్రయాల అనుమతులు ఇవ్వకపోవడంతో అధికారులు కొనుగోళ్లు జరపడం లేదు.
ఆన్లైన్లో అనుమతులు వస్తే గాని రైతుల నుండి పంటను కొనుగోలు చేయలేమని అధికారులు చెబుతున్నారు. పది రోజులకు పైగా కొనుగోలు కేంద్రంలోనే తమ పొద్దుతిరుగుడు ధాన్యం తో ఎదురుచూస్తున్నామని, ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పొద్దుతిరుగుడు మొత్తం పంటను కొనుగోలు చేయాలని, లేకపోతే రోడ్లపై ధర్నాలు చేస్తామని రైతులు చెబుతున్నారు. గురువారం గజ్వేల్ ప్రాంతంలో భారీ వర్షానికి అధిక మొత్తంలో పొద్దుతిరుగుడు ధాన్యం తడిసినట్లు రైతులు బోరున విలపించారు.
సోమవారం వరకు అనుమతులు రావచ్చు: క్రాంతి, మార్క్ఫెడ్ జిల్లా అధికారిణి
వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో 11,193 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు కాగా కొనుగోలు కేంద్రాలకు 7436 టన్నుల పొద్దుతిరుగుడు పంట వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు ఇప్పటివరకు 1,166 మంది రైతుల నుండి 1,811 టన్నుల పంటను కొనుగోలు చేశాం. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం వాటా పెంచడంతోపాటు రాష్ట్ర వాటా కొనుగోళ్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండు నెలల పాటు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి. ప్రతి రైతు పండించిన పంట మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుంది.