- అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి గింజనూ కొనాలి
- వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సన్నాలకు, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలను సిద్ధం చేయాల ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారు లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సన్నాలకు రూ.500 బోనస్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల అవసరాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలని, కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.
కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం మిల్లులకు చేరే వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సన్న రకం ధాన్యం రవాణా కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జామ చేసేందుకు కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో కలెక్టర్ క్రాంతి వల్లూ రు, అదనపు కలెక్టర్ మాధురి, శిక్షణ కలెక్టర్ మనోజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించగా, వెంకటస్వామి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.