19-03-2025 11:58:17 PM
సరిహద్దు వద్ద ఇంటర్నెట్ బంద్.. 200 మంది రైతుల అరెస్ట్..
న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులు బుధవారం రైతు సంఘాల నాయకులు జగ్జీత్ సింగ్, సర్‌వన్ సింగ్‌తో పాటు అనేక మంది రైతులను అరెస్ట్ చేశారు. వీరు మొహాలోని పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్ట్ అయ్యారు. ఖనౌరి నుంచి శంభు సరిహద్దు వరకు ర్యాలీగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ గొడవల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఖనౌరి సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు.
గతంలో దలేవాల్ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. పంటల మద్దతు ధర కోసం దలేవాల్ నిరాహార దీక్షకు దిగారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు, వాటికి చట్టబద్దత, రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ చార్జీలు పెంచకుండా కొనసాగించడం, రైతుల మీద పెట్టిన కేసుల ఉపసంహరణ, 2021లో యూపీలోని లిఖింపూర్‌లో జరిగిన గొడవలో బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టంలో మార్పులు, 2020 గొడవల్లో చనిపోయిన రైతులకు పరిహారం కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ముగిసిన మరో విడత చర్చలు
కేంద్రంతో రైతులు మరో విడత చర్చలు జరిపారు. వివిధ రకాల డిమాండ్లతో చండీగర్‌లో రైతులు కేంద్ర ప్రతినిధులతో సమావేశం కాగా.. ఈ చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. తర్వాతి సమావేశం మే 4న ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ సమావేశానికి పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా కూడా హాజరయ్యారు. కాగా పంజాబ్ రైతు సంఘాల నాయకుల అరెస్ట్‌పై పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మండిపడ్డారు.
రైతుల శిబిరాల తొలగింపు..
శంభూ, ఖనౌరి సరిహద్దుల వద్ద రైతులు శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసనలు చేస్తున్నారు. అయితే బుధవారం భద్రతా సిబ్బంది రైతుల శిబిరాలను తొలగించారు. ఏడాది కాలంగా రైతులు ఈ శిబిరాల్లోనే ఉంటూ పోరాటాలు చేస్తున్నారు. రైతు సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఈ శిబిరాలను తొలగించారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘రైతులు ఇలా రెండు హైవేలను దిగ్భందించడం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి’ అని అన్నారు. అనేక మంది పోలీసులు రైతు సంఘాల నాయకులను, రైతులను అక్కడి నుంచి పంపించారు. ఈ చర్యను రాజకీయ నాయకులు తప్పుబట్టారు.