ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశానికి పతకం ఆశిస్తున్న క్రీడాంశాల్లో బాక్సింగ్ కూడా ఒకటి. 1904 ఒలింపిక్ క్రీడల్లోనే బాక్సింగ్ ప్రవేశపెట్టినప్పటికీ మన బాక్సర్లు పతకం సాధించడానికి 104 ఏళ్లు పట్టింది. బాక్సింగ్‌లో 2008 నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ మన దేశం ఒడిలో పతకం వచ్చి చేరింది. ఈసారి విశ్వక్రీడల్లోనూ మన బాక్సర్లు పంచ్ పవర్ రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు. తొలిసారి ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై భారీ అంచనాలున్నాయి..
ఒలింపిక్ క్రీడలో హాకీ, రెజ్లింగ్, షూటింగ్ తర్వాత భారత్‌కు చెప్పుకోదగ్గ పతకాలు బాక్సింగ్ క్రీడ నుంచి వచ్చాయి. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో బాక్సింగ్ నుంచి మన దేశానికి మూడు పతకాలు వచ్చాయి. తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విజేందర్ సింగ్ కాంస్యం గెలిచి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. 2012 లండ న్ ఒలింపిక్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతో మెరిసింది.
టోక్యో ఒలింపిక్స్ (2020)లో లవ్లీనా బొర్గోహై కాంస్యంతో ముచ్చటగా మూడోసారి దేశానికి పతకం వచ్చింది. అయితే ఈ మూడు కాంస్యాలే కావడం గమనార్హం. ఈసారి బాక్సింగ్ విభాగంలో ఆరుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో మహిళల విభాగం నుంచి నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాస్మిన్ లంబోరియా (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) ఉండగా.. పురుషుల విభాగం నుంచి అమిత్ పంగల్ (51 కేజీలు), నిషాంత్ దేవ్ (71 కేజీలు) పోటీ పడుతున్నారు.
నిఖత్‌పై అందరి దృష్టి..
ఈసారి ఒలింపిక్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై భారీ ఆశలున్నాయి. మేరీకోమ్ తర్వాత రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్.. ఈసారి ఒలింపిక్స్‌లో పతకం కచ్చితంగా సాధిస్తుందన్న నమ్మకముంది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన నిఖత్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ నిలకడ కొనసాగిస్తూ వస్తున్న ఈ నిజామాబాద్ బాక్సర్.. విశ్వక్రీడల్లో దేశానికి స్వర్ణం అందించడమే తన జీవిత లక్ష్యమని వెల్లడించింది. అందుకోసం వందకు రెండొందల శాతం కష్టపడేందుకు సిద్ధమంటున్న నిఖత్.. పారిస్‌లో పతకం సాధించాలని మనమూ ఆశిద్దాం.
ఒలింపిక్స్ పతకం గెలవాలన్నది నా చిన్నపటి కల. దాని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. టోక్యో ఒలింపిక్స్ సమయంలో ట్రయల్స్ కోసం పట్టుబట్టింది కూడా విశ్వక్రీడల్లో పాల్గొనాలనే ఉత్సాహంతోనే. ఇప్పుడు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించా. ఆ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ఎన్నోఏళ్లుగా అనుకుంటున్నా. ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా.
-నిఖత్ జరీన్