అఫ్గాన్‌పై విండీస్ ఘన విజయం
సెయింట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను ఆతిథ్య వెస్టిండీస్ విజయంతో ముగించింది. గ్రూప్ సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. జాన్సన్ చార్ల్స్ (27 బంతుల్లో 43, 8 ఫోర్లు), హోప్ (17 బంతుల్లో 25), పావెల్ (15 బంతుల్లో 26) రాణించారు.
అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ 2 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హక్‌లు చెరొక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఇబ్రహీం జద్రన్ (28 బంతుల్లో 38, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అజ్మతుల్లా (23) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో ఒబెద్ మెక్‌కాయ్ 3 వికెట్లు పడగొట్టగా.. మోతీ, అకిల్ హొసెన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న పూరన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.
ఒకే ఓవర్లో 36 పరుగులు
కాగా ఇదే మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించడం విశేషం. అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో పూరన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవర్‌లో పూరన్ వరుసగా 6, 4+ నోబాల్, వైడ్+ 4, 0, 4, 4,6,6 బాది 36 పరుగులు పిండుకున్నాడు. కాగా కేవలం 2 పరుగుల దూరంలో రనౌట్‌గా వెనుదిరిగిన పూరన్ సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.