భైంసా, జనవరి 15: భైంసా ప్రాంతం నుంచి తీర్థయాత్రలకు 50 మందితో యాత్రికులతో బయలుదేరిన బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో ఓ యాత్రికుడు సజీవ దహనం కాగా, మిగతా ప్రయాణికులు సురక్షితంగా తిరిగి వస్తున్నారు. స్థానికుల కథనం మేరకు భైంసా డివిజన్‌లోని పలువురు ఈ నెల 1న తీర్థయాత్రలకు వెళ్లారు.
కుభీరు మండలం పల్సికి చెందిన దృపత్(65) కూడా యాత్రకు వెళ్లాడు. మంగళవారం యూపీలో బృందావన్ వద్ద బస్సులో మంటలు చెలరేగడంతో దృపత్ సజీవదహనమయ్యాడని పేర్కొన్నారు. మృతుడి భార్య ఎల్లవ్వ రోదనలు మిన్నంటాయి. యాత్రికుల సామగ్రి, నగదు, దుస్తులు కాలిబూడిదయ్యాయి.
తోటి యాత్రికులు ఆమెను ఓదార్చేందుకు యత్నించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న అక్కడి పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం బాధితుల రక్షణ కల్పించి భోజన వసతి ఏర్పాట్లు చేశారు. అక్కడి అధికారులు సహకారంతో బుధవారం దృపత్ మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
మిగతా వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతో వారు సురక్షితంగా భైంసాకు తిరిగి వస్తున్నట్లు తెలిపారు. సంఘటన గురించి ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ వివరాలు తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.