07-07-2024 01:55:24 AM
ప్రిన్సిపాల్‌ను బలవంతంగా కుర్చీ ఖాళీ చేయించిన సిబ్బంది
ప్రయాగ్‌రాజ్, జూలై 6 : ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న ప్రిన్సిపల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ఆమె స్థానంలో ప్రభుత్వం వేరే వ్యక్తిని నియమించగా.. సీటు వదిలేందుకు ససేమిరా అన్నది. దీంతో, పాఠశాల సిబ్బంది ఆమెను బలవంతంగా లాగి, కొత్త ప్రిన్సిపల్‌ను కూర్చోబెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో పరిశీలిస్తే.. పాఠశాల సిబ్బంది ప్రిన్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి పాత ప్రిన్సిపల్‌ను వెంటనే కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపల్ పరుల్ సోలమాన్ నిరాకరించడంతో ఆమెను బలవంతంగా కుర్చీ నుంచి తీసేసి ఫోన్ లాక్కున్నారు. అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపల్‌ను ఆమె స్థానంలో కూర్చోబెట్టి చప్పట్లతో స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, తనను బలవంతంగా ప్రిన్సిపల్ సీటు ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.