calender_icon.png 24 October, 2024 | 2:46 AM

లోపాలను సరిదిద్దడంలో పీయూసీ కీలకం

24-10-2024 12:12:10 AM

  1. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ 
  2. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీయూసీ సమావేశం

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే అవకతవకలు, లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రభుత్వానికి ఆర్థిక పరిపుష్ఠిని అందించడంలో అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీదే (పీయూసీ) కీలకపాత్ర అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించి, సూచనలు చేస్తాయని తెలిపారు. పీయూసీ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన పీయూసీ సమావేశానికి స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు, కమిటీ సభ్యులు సంజీవ్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, శేరి సుభాష్‌రెడ్డి, తాతా మధుసూదన్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. కమిటీ సభ్యులందరూ ప్రతీ సమావేశానికి హాజరై ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలని, సంస్థల బలోపేతానికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీయూసీ అత్యంత ప్రాధాన్యతగల కమిటీ అని, ప్రభుత్వానికి రాబడి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పని చేయాలన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కమిటీలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యనిర్వాహఖ శాఖ, శాసన నిర్మాణ వ్యవస్థకు తద్వారా ప్రజలకు ఎప్పుడూ జవాబుదారీగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా కార్పొరేషన్ల అకౌంట్లను, నివేదికలను క్షుణ్నంగా పరిశీలించి, వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అధికారం ఈ కమిటీకి ఉంటుందని పేర్కొన్నారు.

పీయూసీ చైర్మన్ శంకరయ్య మాట్లాడుతూ.. గత పాలకుల కాలంలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, తిరిగి ఆ సంస్థల బలోపేతానికి తమ కమిటీ కృషి చేస్తుందన్నారు. సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యాలు, రాష్ట్ర అకౌంటెంట్ జనరల్  పీ మాధవి, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.