calender_icon.png 25 October, 2024 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి

29-08-2024 12:00:00 AM

  1. అధికారులకు ఎంపీ రఘునందన్‌రావు ఆదేశం 
  2. సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై సమావేశం 
  3. పూర్తి వివరాలతో రాని ఆఫీసర్లపై ఆగ్రహం

సిద్దిపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అధికారులు ప్రచారం చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు సూచించారు. ఎంపీ అధ్యక్షతన బుధవారం సిద్దిపేట లో జిల్లా అభివృద్ధి కో ఆర్డినేషన్ మానిటరింగ్ మీటింగ్(దిశ) నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారిగా జరిగిన అభివృద్ధికి సంబంధించిన వివరాలు ఎంపీ కోరగా.. ఏ ఒక్క అధికారి కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో వారిపై ఎంపీ అసం తృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి డ్రాగన్ ఫ్రూట్, ఆవకడ తోటల సాగుపై రైతులు అవగాహన కల్పించాలని సూచించారు.

సీపీవో వద్ద ఉన్న నిధులు, మంజురైన పనులు, ఎంపీ నిధుల మంజూరు, విడుదల వంటి అంశాలను వెల్లడించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న పనులకు అవసరమైన నిధుల కోసం ప్రజాప్రతినిధులకు సిఫారసు చేయాలని సూచించారు. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం నిర్మూలనకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దుబ్బాక, చేర్యాల పట్టణాల్లో సెట్విన్ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

దుబ్బాక నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన వారికి భవన నిర్మాణ, అనుబంధ రంగాలపై, స్వయం ఉపాధి పట్ల శిక్షణ ఇచ్చి ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడు తూ.. విద్యుత్ తీగల కింద తక్కువ ఎత్తు పెరిగే మొక్కలు నాటాలని, గ్రామాల్లోకి కోతులు రాకుండా అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలు పెంచాలన్నారు. సమావేశంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, గరిమా అగర్వాల్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కవిత బెయిల్‌కు బీజేపీకి సంబంధం లేదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు, ఆమెకు వచ్చిన బెయిల్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. బీజేపీ కాదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను, రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.