22-02-2025 07:08:13 PM
బైకులను పక్కనపెట్టి బస్సుల్లో ప్రయాణం
కాటారం,(విజయక్రాంతి): పెద్దపులి సంచారంతో ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. కాటారం మహదేవ పూర్ రహదారి మధ్యలో శనివారం మిట్ట మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దపులి సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వాహనదారులు గుండెలను అరచేతుల పెట్టుకొని ప్రయాణించారు. కాటారం నుంచి మహాదేపూర్ వైపు వెళుతున్న బొలెరో వాహనాన్ని సమీపించిన పెద్దపులిని గమనించిన సదరు వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అతి చాకచక్యంగా వాహనాన్ని ముందుకు కదిలించినట్లు ప్రత్యక్ష సాక్షులు "విజయ క్రాంతి"తో తెలిపారు. గడిచిన వారం రోజుల నుంచి కాటారం మండలం నస్తూరు పెల్లి, గుండ్రాత్ పెల్లి, మహదేవపూర్ మండలం కుంట్లం, పలుగుల, బీరసాగర్ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి తాజాగా శనివారం మధ్యాహ్నం పూట కాటారం మహాదేవపూర్ 353(సి) జాతీయ రహదారిపై రోడ్డు దాటిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నస్తురు పెల్లి అడవిలో రోడ్డు దాటిన పెద్దపులి ఇటు కాటారం మండలం మర్రిపల్లి, ప్రతాపగిరి గుట్టల్లోకి లేదా మహాదేవపూర్ మండలం బొమ్మపూర్, రాపల్లి కోట గుట్టలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయం దావనంలా వ్యాప్తి చెందడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మహాదేవపూర్ ప్రాంతం నుంచి కాటారంకు వస్తున్న ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను పక్కనపెట్టి బస్సులలో ప్రయాణించారు. అలాగే కాటారం సమీప ప్రాంతాల ప్రజలు మహాదేవపూర్ వైపు ప్రయాణాలను కొద్దిసేపు సడలించుకున్నారు. ఇది ఇలా ఉండగా అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడం శోచనీయమని పలువురు బాహటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.