- మత సామరస్యం, అభివృద్ధిపైనే దృష్టి
- పనుల్లో రాజీ పడొద్డు.. నాణ్యతలో వెనక్కి తగ్గొద్దు..
- హైదరాబాద్-విజయవాడకు ఆరు లైన్ల రోడ్డు
- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సూర్యాపేట, జూలై4: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడబోమని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో చేపడుతున్న పనులపై అధికారు లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాం తంలో అన్ని మతాల వారు ఉన్నారని.. అందరికీ తగిన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల్లో చేపడుతున్న పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని.. నాణ్యతలో వెనుకకు తగ్గే పసక్తే లేదని స్పష్టంచేశారు. అభివృద్ధి పనులను యుద ప్రాతిప దికన చేపట్టి త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రెండు నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం అనంతగిరి, పాలకవీడు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయా ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కోదాడను రూ.20 కోట్లతో, హుజూర్‌నగర్‌ను సైతం కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రజల సౌకర్యార్ధం హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని త్వరలో ఆరులైన్లుగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. జగ్గయ్యపేట నుంచి విష్ణుపురం వరకు రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును నడిపించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మేళ్లచెరువు శివాలయంలో రూ.55 లక్షలతో నిర్మిస్తున్న రాజగోపురం, రూ.1.50 కోట్లతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్‌ఏసీ ఆధ్వర్యంలో 30 మందికి రూ.2.10 లక్షల విలు వ గల కుట్టుమిషన్లను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు ఎస్పీ నాగేశ్వర్ రావు, ఆర్డీవోలు సూర్యనారాయణ, శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.