* ప్రధాన ప్రతిపక్షంతో పాటు బీజేపీ కూడా విమర్శలకు దిగడంతో వాటిని తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి రుణమాఫీ, రైతు భరోసా లాంటి హామీల అమలుకు ఉపక్రమించాల్సి వచ్చింది. మిగతా అభివృద్ధి పథకాలను సైతం పక్కనపెట్టి ఈ పథకాల కోసం నిధులను సమకూర్చుకొన్నారు. అయినా వేల కోట్ల రూపాయలు అవసరమైన కారణంగా విడతలవారీగా అమలుచేయక తప్పలేదు.
* స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినందున అందుకు తొలి అడుగుగా సమగ్ర కులగణనకు నడుం బిగించింది. ఈలోగా ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం దాన్ని సైతం పూర్తి చేసింది.
ఈ రెండు నివేదికలను కేబినెట్ ఆమోదించడం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించడంతో ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిందనే చెప్పాలి.
* అధికార, ప్రతిపక్షాలు నిత్యం పరస్పర ఆరోపణ లు, సవాళ్లతో కత్తులు దూసుకొంటున్నాయి. విమర్శలు, ప్రతివిమర్మలు శ్రుతిమించి తొడలు చరుచుకునే స్థితికి చేరుకొంటు న్నాయి. అది అసెంబ్లీ అయినా, బయట అయినా ఇరుపక్షాల తీరులో మార్పు ఉండడం లేదు.
హుందాతనానికి అటు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల దాకా, ఇటు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, బీజేపీ నేతలు బండి సంజయ్‌లాంటి వాళ్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారుతున్నాయి.
ఎన్నికలు రావడానికి ఇంకా మూడున్నరేళ్లకు పైగా సమయం ఉంది. ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. అలాంటప్పుడు ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకు? దీనివల్ల తాత్కాలిక రాజకీయ ప్రయోజనం దక్కవచ్చుకానీ దీర్ఘకాలంలో రాష్ట్ర పరువే పలచనవుతుంది.
* దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులను రాబట్టగలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షా 70 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించించిన పలు ఒప్పందాలను ఖరారు చేసుకుంది.
మైక్రోసాఫ్ట్‌లాంటి ప్రపంచ దిగ్గజసంస్థలతో పాటుగా మేఘా ఇంజినీరింగ్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పలు దేశీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయంటే అది రేవంత్ సర్కార్ ఘనతేనని చెప్పాలి.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుదిశగా ముందుకు సాగుతున్నది. ఇది ముదావహం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్రం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజునుంచే హమీల అమలుకు చర్యలు తీసుకొంటు న్నది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ అయిన కులగణన, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుకు సర్వేలు పూర్తి చేసి వివరాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచింది. మొన్న టికి మొన్న, దావోస్ పర్యటనలో భాగంగా గతం లో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో లక్షా 70 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా వేలాది ఉద్యోగాల కల్పనకు బాటలు వేసింది. మూసీ ప్రక్షాళన చేపట్టి కాలుష్యాన్ని అంతమొందించేందుకు,
గోదావరి నీటిని మూసీలోకి మళ్లించడం ద్వారా రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించడానికి నడుం బిగించింది. హైదరాబాద్ నగరం నలుదిక్కులకు మెట్రో సేవలను విస్తరించడానికి ప్రణాళి కను సిద్ధం చేసింది. కేవలం 13 నెలల వ్యవధిలోనే తమది ప్రజాపాలన అని చెప్పుకుంటు పాలనా పరంగా తనదైన ముద్ర వేసేందుకు బృహత్ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకొంటోంది.
ఆదిలోనే హంసపాదు
అధికారంలోకి రావడానికి ప్రతిపార్టీ ప్రజలకు రకరకాల హామీలు ఇవ్వడం ఇప్పుడు సాధారణమైంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి బలంగా వేళ్లూనుకుని ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల పేరిట పలు హామీలను ప్రకటించింది. ఆ హామీలకు ఆకర్షితులయ్యో లేక బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతోనో రాష్ట్రప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారు.
తీరా పాలనను మొదలుపెట్టేందుకు ఉపక్రమించే సరికి ఖాళీ ఖజానా దర్శనమిచ్చింది. దీనికి తోడు గత ప్రభుత్వం చెల్లించ కుండా ఉన్న వేలాది కోట్ల రూపాయల బకాయిలు దర్శనమిచ్చాయి. అన్నిటికన్నా మించి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల కోసం కేసీఆర్ చేసిన లక్షల కోట్ల రుణాలకు వడ్డీలు చెల్లించడానికి, ఉద్యోగుల జీతాలకు సైతం కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి.
దీంతో పాలనను గాడిలో పెట్టడానికే రేవంత్ సర్కార్‌కు దాదాపు అరు నెలల సమయం పట్టింది. ఇచ్చిన హామీల్లో మొదట ఒక్క ఉచిత బస్సు పథకం తప్ప మరేమీ అమలు చేయలేకపోయింది. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందంటూ విపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.
దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో, తాము ఎందుకు హామీలను అమలు చేయలేకపోతున్నామో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షంతో పాటుగా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా విమర్శలకు దిగడంతో వాటిని తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి రుణమాఫీ, రైతు భరోసా లాంటి హామీలను అమలు పరిచేందుకు ఉపక్రమించాల్సి వచ్చింది.
మిగతా అభివృద్ధి పథకాలను సైతం పక్కన పెట్టి ఈ పథకాల కోసం నిధులను సమకూర్చుకొన్నారు. అయినా వేల కోట్ల రూపాయలు అవసరమైన కారణంగా విడతలవారీగా అమలుచేయక తప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో రాష్ట్రప్రజలు సంతృప్తి చెందినట్లే కనిపిస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు విషయంలో అక్కడక్కడా కాస్త అసంతృప్తి వ్యక్తమ యినా ప్రతిపక్షాలు చెప్పినంతగా ఆగ్రహజ్వాలలు అయితే కనిపించలేదు.
కులగణన, వర్గీకరణ
ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమయిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినందున అందుకు తొలి అడుగుగా సమగ్ర కులగణనకు నడుం బిగించింది.
ఈలోగా ఎస్సీ వర్గీక రణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం దాన్ని సైతం పూర్తి చేసిం ది. ఈ రెండు నివేదికలను కేబినెట్ ఆమోదించడం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించడంతో ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిందనే చెప్పాలి.
మూసీ ప్రక్షాళన
ఓవైపు రాజకీయంగా పట్టు సాధిస్తూనే మరో వైపు అభివృద్ధిపైనా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ ఆ దిశగా కూడా వడివడిగా అడుగులు వేసింది. లక్ష కోట్ల వ్యయంతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణతో పాటుగా గోదావరి జలాలను మూసీకి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తద్వారా రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీటితో పాటుగా వందలాది గ్రామాలకు తాగునీటిని అందించే బృహత్పథకానికి నడుం బిగించింది.
నేడో రేపో మూసీ ప్రక్షాళన పనులు మొదలు కానున్నట్లు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లుగా ప్రణాళిక సజావుగా సాగితే అటు నల్గొండ జిల్లా రైతుల మద్దతుతో పాటుగా ఇటు హైదరాబాద్‌లో మూసీ కాలుష్యం బెడద శాశ్వతం గా తొలగిపోయి నదీ పరీవాహక ప్రాంతాలు అభివృద్ధికి వీలు కలుగుతుంది.
అలాగే పెరిగిపోతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా నాలుగు ఫేజ్‌లుగా నగరం నాలుగు వైపులకు మెట్రో విస్తరణకు కూడా ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపడంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పాతబస్తీ, శివారు ప్రాంత ప్రజల కల నెరవేరనుంది.
దావోస్ సక్సెస్
నగరాభివృద్ధికి తాము చేపట్టబోయే బృహత్పథకాలు పునాదిగా రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భారీ పెట్టుబడులను రాబట్టగలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షా 70 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించించిన పలు ఒప్పందాలను ఖరారు చేసుకుంది.
మైక్రోసాఫ్ట్‌లాంటి ప్రపంచ దిగ్గజసంస్థలతో పాటుగా మేఘా ఇంజినీరింగ్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పలు దేశీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయంటే అది రేవంత్ సర్కార్ ఘనతేనని చెప్పాలి. దీంతో పాటుగా స్కిల్ యూనివర్సిటీ వంటి వినూత్న ఆలోచనలతో ప్రభుత్వం అటు విదేశీ మదుపరులతో పాటుగా ఇటు దేశంలోని కంపెనీలు రాష్ట్రం వైపు చూసేలా చేయగలిగిందనడంలో సందేహం లేదు.
ఎందుకీ రాజకీయ బురద?
అయితే ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చాలంటే వేల కోట్ల నిధులు అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ పెట్టుబడులు పెట్టే స్థోమత రాష్ట్రప్రభుత్వానికి లేదు. ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలతో పాటుగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలనుంచి రుణాలు అవసరం. అవి పొందాలంటే రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత అవసరం.
అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్షాలు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అదే లోపించిందనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు నిత్యం పరస్పర ఆరోపణ లు, సవాళ్లతో కత్తులు దూసుకొంటున్నాయి. విమర్శలు, ప్రతివిమర్మలు శ్రుతిమించి తొడలు చరుచుకునే స్థితికి చేరుకొంటున్నాయి.
అది అసెంబ్లీ అయినా, బయట అయినా ఇరుపక్షాల తీరులో మార్పు ఉండడం లేదు. హుందాతనానికి అటు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల దాకా, ఇటు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, బీజేపీ నేతలు బండి సంజయ్‌లాంటి వాళ్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారుతున్నాయి. ఎన్నికలు రావడానికి ఇంకా మూడున్నరేళ్లకు పైగా సమయం ఉంది.
ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. అలాంటప్పుడు ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకు? దీనివల్ల తాత్కాలిక రాజకీయ ప్రయోజనం దక్కవచ్చుకానీ దీర్ఘకాలంలో రాష్ట్ర పరువే పలచనవుతుంది. ఈ విషయాన్ని ఇరుపక్షాలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. తాము ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని దృష్టి పెట్టుకుని పాలకులు పరిపాలనపైన, ప్రజల యోగక్షేమాలపైన దృష్టిపెట్టి ముందుకు సాగితే ప్రజల మన్నన పొందగలుగుతారు.
అలాగే ప్రతిపక్షాలు సైతం ఎంతసేపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ప్రజల్లో మైలేజి పెరగదు సరికదా అసహ్యించుకునే స్థితి వస్తుంది. పాలనలోని లోపాలను ఎత్తి చూపడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందేందుకుయత్నించాలి.
ఇప్పటివరకు జరిగిం దంతా పక్కన పెట్టి ఇకనైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టలో పెట్టుకుని ఇరుపక్షాలు సంయమనం పాటించి హుందాగా వ్యవహరిస్తే అదే వారికి ప్లస్ పాయింట్‌గా మారుతుంది. లేకపోతే ప్రజలే వేలెత్తి చూపుతారు.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి