డా.బుర్ర మధుసూదన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి గుండెకాయలుగా పార్లమెంట్‌లు సేవలు అందించాలి. ప్రజల గొంతుకలుగా చట్టసభలు పని చేయాలి. ప్రజాహిత నిర్ణయాలను నిష్పాక్షికంగా తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత సమగ్రాభివృద్ధికి ప్రతిన బూనే వేదికలుగా పార్లమెంట్‌లు కృషి చేయాలని విశ్వమానవాళి కోరుకుంటోంది.
నేడు ‘అంతర్జాతీయ పార్లమెంటరిజం దినం’
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2018లో చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ప్రతి ఏటా జూన్ 30న ప్రపంచదేశాలు ‘అంతర్జాతీయ పార్లమెంటరిజమ్ దినం’ (ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజమ్) నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ప్రజా సంక్షేమ కేంద్రా లు, చట్ట శాసనసభలుగా పార్లమెంటరీ వ్యవస్థలు చేస్తున్న అపార కృషికి స్పందనగా సాధారణ మానవాళి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ వేదికలు ఉపకరిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవ లు అందించాలని కూడా సూచనలు చేయడం జరుగు తుంది.
1889 జూన్ 30న ఉద్భవించిన ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపియూ) అంతర్జాతీయ సంఘ కృషికి గుర్తుగా 2018 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ పార్లమెంటరిజమ్ దినం’ నిర్వహిస్తు న్నారు. 135 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఐపియూలో 180 దేశాల పార్లమెంట్లకు చెందిన 46,000 మంది పార్లమెంటేరియన్లు సభ్యులుగా ఉండడం విశేషం. అన్ని వర్గాల ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థలో సమాన అవకాశాలు కల్పించాలని కోరడం, ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడం, శాంతి నెలకొల్పడం, లింగ సమానత్వ సాధన, మానవ హక్కుల పరిరక్షణ, మైనారిటీ వర్గాల హక్కులు కాపాడడం, యువతకు చోటు ఇవ్వడం, దివ్యాంగులకు సముచిత స్థానం ఇవ్వడం, అవినీతి పాలకుల భరతం పట్టడం లాంటి పలు అంశాలను చర్చించే వేదికలుగా ఈ సమావేశాలు ఉపకరిస్తాయి.
ప్రజాస్వామ్యానికి తూట్లు
ఫ్రెంచ్ భాషలో ‘పార్లర్’ అంటే చర్చించడం (టు టాక్) అని అర్థం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య నియమాలను ప్రపంచ దేశాలు పాటించాలని సూచించడం జరుగుతోంది. ప్రజాస్వామ్యానికి గుండెకాయ లుగా పార్లమెంట్‌లు సేవలు అందించాలి. ప్రజల గొంతుకలుగా పార్లమెంట్‌లు పని చేయాలని, ప్రజాహిత నిర్ణయాలను నిష్పాక్షికంగా తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత సమగ్రాభివృద్ధికి ప్రతిన బూనడానికి వేదికలుగా పార్లమెంట్‌లు కృషి చేయాలని విశ్వమానవాళి కోరుకుంటోంది. నేటి డిజిటల్ యుగంలో మారు తున్న మానవీయ విలువలు, జరుగుతున్న అరాచకాలు, ప్రజాందోళనలు, ప్రజాస్వామ్యానికి పడుతున్న తూట్లు, బడు గులకు ప్రాతినిధ్యం కొరవడడం, రాక్షస రాజకీయ క్రీడలు, స్వేచ్ఛా హక్కుకు తలుపులు మూయడం, చట్టసభలు డబ్బున్నో ళ్లకే చుట్టాలుగా మారడం, అశాంతి నెలకొన్న సమాజం లాంటి పలు సవాళ్ళ నడుమ నేటి పార్లమెంట్లు దారి తప్పుతూ ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కడం కొనసాగుతోంది.
యువత, మహిళల ప్రాతినిధ్యం?
ప్రపంచ జనాభాలో 40 ఏండ్లలోపు యువత 40 శాతం వరకు ఉన్నప్పటికీ పార్లమెంటరీ చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం 17. 5 శాతం మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోని దాదాపు 33 శాతం పార్లమెంట్లలో 30 ఏండ్లలోపు యువతకు ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ప్రమాదకర అంశంగా భావిం చాలి. మరోవైపు మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు సగం ఉన్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మాత్రం 20 30 శాతం కూడా ఉండడం లేదు. ప్రపంచవ్యాప్త పార్లమెంటరీ వ్యవస్థలో యువత గొంతు లు, అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నిర్ణయాధికారంలో యువత ఆలోచనలకు పట్టం కట్టాలని కోరుతున్నారు. అనాదిగా పౌరసమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లు కృషి చేయాలని, భవిష్యత్తు తరాలకు పటిష్ఠమైనబాటలు వేయాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని, సానుకూల వాతావరణంలో చట్టసభలు చర్చ జరపాలని సామాన్య జనం కోరుకోవడం కొనసాగుతూనే ఉంటున్నది.
క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులు
ఈరోజు ఇతివృత్తంగా ‘పార్లమెంటరీ దౌత్యం: శాంతి, అవగాహనలకు వారధుల నిర్మాణం’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారాలు నిర్వహిన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలు నిస్వార్థంగా పని చేస్తేనే ప్రపంచ మానవాళి సంక్షేమం, శాంతి స్థాపనలు కొనసాగుతాయని గమనించి పార్లమెంట్ సభ్యులు ప్రజా సేవకులుగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో కృషి చేయాలని ప్రజ లు కోరుకుంటూ ఎదురు చూస్తున్నారు. అయితే, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా నిరక్షరాస్యత, పేదరికం, అనంత అవినీతి, లింగ వివక్ష, అసమానతల అగాధాలు, ఉగ్రవాదం, నిరుద్యోగం, ప్రాంతీయ వాదనలు, కులమత వివక్షలు/విబేధాలు, డ్రగ్స్ దుర్వినియోగాలు, మహిళలపై హింస, కోరలు చాస్తున్న కాలుష్యం లాంటి అంశా లు అనాదిగా నిలుస్తున్నాయి. స్వతంత్ర భారత పార్లమెంటరీ వ్యవస్థలో లోక్‌సభ, రాజ్యసభలు పునాదులుగా నిలుస్తున్నాయి.
మన పార్లమెంటులో మెజారిటీ పార్టీ నాయకుడిగా ప్రధానమంత్రి లోక్‌సభలో నాయ కత్వం వహించడం, రాజ్యసభ లో సీనియర్ మంత్రిని సభా నాయకుడిగా పీఎం నియమించడం జరుగుతోంది. ఇప్పటి వరకు 18 సాధారణ ఎన్నికల ద్వారా పార్లమెంటుకు లోక్‌సభ సభ్యులు ఎన్నికైనారు. మన పార్లమెంటరీ వ్యవస్థకు జవాబుదారుడిగా ప్రధానమంత్రి నిలుస్తున్నారు. 17వ పార్లమెంటులోని రెండు సభల్లో ఉన్న 776 ఎంపీల్లో 306 మంది (40 శాతానికి పైగా) ఎంపీలపై క్రిమినల్ కేసులు (మర్డర్లు, మానభంగాలు, కిడ్నాపులు, మహిళల పట్ల హింస లాంటి అభియోగాలు) నమోదు కాగా, వాటిలో 194 (25 శాతం) మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఒక ఎంపీ సగటు ఆస్తులు రూ.38 కోట్లుగా ఉండగా అందులో 53 మంది (అంటే 7 శాతం) బిలియనీర్లు ఉన్నారు. 2024లో కొలువు తీరిన 18వ లోక్‌సభలో ఎంపికైన 543 మంది ఎంపీల్లో 251 మంది (46 శాతం) పై క్రిమినల్ కేసులు, 31 శాతం ఎంపీలపై తీవ్రమైన ఆరోపణలు నమోదు అయ్యాయని తెలుస్తోంది.
దాదాపు సగం మంది పార్లమెంట్ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు కావ డం, ధనబలం గెలుపును నిర్ణయించడం, కండబలం పార్లమెంటరీ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో భారత పార్లమెంట్ ప్రజల పక్షపాతిగా సేవలు అంది స్తుందనే విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతోంది. ప్రజాస్వామ్యం పరిహాసం పాలు కావడం, అధికారం స్వార్థ ప్రయోజనాలకు నెలవుగా మారడంతో పార్లమెం టరీ వ్యవస్థలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం ప్రమాదకర పరిణామంగా భావించాలి. పార్లమెంటరీ వ్యవస్థలు ప్రజాభిప్రాయాలకు పట్టం కట్టాలని, అసలైన నాయకులే ఎంపీలు, ఎంఎల్‌ఏలుగా ఎన్నిక కావాలని ఓటర్లు అభిప్రాయపడే రోజులు రావాలని కోరుకుందాం.
వ్యాసకర్త సెల్: 9963499282