నివాళి అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు కాళోజీ నారాయణరావు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.
కాళోజీ వర్ధంతి సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ‘కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణరావు.. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ.
అలాంటి మహనీయుడి జయంతిని కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.