ఆర్టీసీ అధికారుల సమీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...
మునుగోడు (విజయక్రాంతి): గత ప్రభుత్వంలో ప్రజారవాణా వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని,రవాణా వ్యవస్థను పటిష్ట అమలు పరచాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు కొత్త బస్సులను తీసుకొచ్చామని, ఇంకా మరికొన్ని రోడ్లలో బస్సులు నడపాలని సూచించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంతో పాటు, చండూరు నాంపల్లి మండల కేంద్రాలలో ఆధునిక బస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని వాటికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయని, నియోజకవర్గంలో 2 ఎక్సప్రెస్ రూట్లను నడపాలని తెలిపారు. నల్గొండ నుండి మునుగోడు నారాయణపురం చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కు, నల్గొండ నుండి కనగల్, చండూరు, మర్రిగూడెం మాల్ మీదుగా హైదరాబాద్ వరకు ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడపాలన్నారు. పాత రోడ్లను పునరుద్ధరించాలని దాంట్లో భాగంగా నాంపల్లి చండూరు మునుగోడు నార్కెట్పల్లి వరకు బస్సులను నడపాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా రెండు ఎక్స్ప్రెస్ రూట్లు, నాంపల్లి నుండి నార్కట్పల్లి రూట్ లలో త్వరలోనే బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నల్గొండ ఆర్టీసీ రీజియన్ ఆర్ఎం కే జాన్ రెడ్డి, నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్, ఆర్టీసీ డిప్యూటీ అంజయ్యలు పాల్గొన్నారు.