calender_icon.png 15 October, 2024 | 3:45 AM

ప్రజారవాణా ఆగమాగం

15-10-2024 01:33:28 AM

హైదరాబాద్‌లో తగ్గిన బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు 

మెట్రోపై పెరిగిన భారం

ఇబ్బందుల్లో నగరవాసులు

హైదరాబాద్, అక్టోబర్ ౧౪ (విజయక్రాంతి): భాగ్యనగరంలో బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లను తగ్గించడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో సుమారు 3500 సిటీబస్సులు ఉండేవి. కొవిడ్ తర్వాత 2020లో ఒకేసారి సుమారు వెయ్యి బస్సులు తగ్గించారు.

దానికి తోడుగా పేద ప్రజలకు చౌకగా రవాణా సేవలు అందించే ఎంఎంటీఎస్ సైతం రైళ్లను, ట్రిప్పులను భారీగా తగ్గించింది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రజారవాణాకు తగ్గట్లుగా సౌకర్యాలు లేకపోవడంతో నగరవాసుల కష్టాలు పడుతున్నారు. సుమారు హైదరాబాద్ అంత జనాభా ఉన్న బెంగళూరులో 6,500కు పైగా సిటీ బస్సులు ఉంటే మన వద్ద కేవలం 2 వేల బస్సులే.

అటు బస్సులు లేక ఇటు ఎంఎంటీఎస్ రైళ్లు తగ్గిపోయి ప్రయాణికులు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో నిలబడేందుకు కూడా చోటు లేని విధంగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో మెట్రో కొత్త రూట్లలో భారీగా డిమాండ్లు వస్తున్నాయి.

పెరిగిన ప్రయాణికులు.. తగ్గిన బస్సులు

కోటికి పైగా జనాభా.. కొత్తగా ఔటర్ రింగ్ రోడ్.. చుట్టూరా పెద్దపెద్ద టౌన్‌షిప్‌లతో హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు 3,500 బస్సులు 44 వేల ట్రిప్పుల ద్వారా సుమారు 30 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులుండేవి.

ఇప్పుడు రాత్రి 10 దాటితే చాలు బస్సులు కనిపించడం లేదు. ప్రస్తుతమున్న 2వేల బస్సులు నగరంలోని ప్రయాణికులకు ఏమూలకూ సరిపోవడం లేదు. నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సైతం సిటీ బస్సులు ఒకప్పుడు పెద్దఎత్తున బస్సులు ఉండేవి.

ఇప్పుడు దాదాపుగా తగ్గించేశారు. దీంతో మహిళలు, సీనియర్ సిటిజన్లు రాత్రిపూట నగరంలో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం నగరంలో వెయ్యి బస్సులను తగ్గించడంతో సిబ్బందిని డిపో అటెండర్లు, కార్గో సహా ఇతర సేవలకు వాడుతున్నారని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. 

ఎంఎంటీఎస్‌దీ ఇదే పరిస్థితి

నగరంలో సిటీ బస్సులతో సమానంగా సేవలు అందించిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు మ్యూజియంలో బొమ్మల్లా మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు 40కిపైగా ఎంఎంటీఎస్ రైళ్లు 121 ట్రిప్పులతో 1.50 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేవి. క్రమంగా వాటిని తగ్గిస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఫలక్‌నుమా లింగపల్లి, హైదరాబాద్ ఫలక్‌నుమా, సికింద్రాబాద్ మేడ్చల్ సనత్ నగర్, సికింద్రాబాద్‌ో ఉందానగర్ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయి. కానీ ఇవి వేళకు రాకపోవడంతో వీటిని నమ్ముకున్న ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది.

ఒకప్పుడు 40 రైళ్లుంటే ప్రస్తుతం కేవలం 10 ఎంఎంటీఎస్ రైళ్లకు గాను సెప్టెంబర్ నెలలో కేవలం 4 జతల రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. అవీ వేళకు రావడం లేదు. ఫలితంగా వీటిని నమ్ముకున్న ప్రయాణికుల సంఖ్య 1.50 లక్షల నుంచి 10 వేలకు తగ్గింది. కేవలం రూ.5 నుంచి రూ.10 వరకు మాత్రమే ఛార్జి ఉండే ఈ రైళ్లను క్రమంగా తీసేస్తూ పేద ప్రయాణికులపై భారం మోపుతున్నారు.

మెట్రో సేవలపై పడుతున్న భారం..

ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు తగ్గిపోయిన తరుణంలో ప్రయాణికులు మెట్రో సేవలపై ఆధారపడుతున్నారు. 2020లో రోజుకు 1.25 లక్షలున్న మెట్రో ప్రయాణికులు క్రమంగా పెరుగుతూ వచ్చారు. 2021లో 2.4 లక్షలు, 2022లో 3 లక్షలు, 2023లో 3.5 లక్షలుగా ఉంది. 2024లో ఒకేసారి 5 లక్షలకు చేరుకుంది.

దీంతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్ కంటే అధిక ధర వసూలు చేస్తున్నా ప్రయాణికులు మెట్రోపైనే ఆధారపడే పడుతున్నారు. ప్రస్తుతమున్న మియాపూర్ పాటు ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రూట్లకు అదనంగా నగరంలోని అన్ని మూలలకు మెట్రో సేవలు అందుబాటులో తెస్తే ప్రజారవాణా మరింత మెరుగవుతుందని ప్రయాణికులు అంటున్నారు.

సూపర్ ఫాస్ట్ రైళ్లతో ఎంఎంటీఎస్‌కు బ్రేకులు

ఉందానగర్ నుంచి లింగంపల్లి, హైదరాబా ద్‌టూ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళ ల్లో ప్రతి అరగంటకు ఓ రైలుంటే ఎంతో ప్రయోజ నంగా ఉంటుంది. 1974లో ఆవిరితో నడిచే రైళ్లున్న కాలంలోనే నగరంలో 47 రైళ్లుండేవి. ఇంత ఆధునిక యుగంలో ఇప్పడు కేవలం 10 రైళ్లున్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులకు ఏ మేర సేవలు అందిస్తాయి. అందు కే రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచాలి.

 నూర్ అహ్మద్, రైల్వే ప్రయాణికుల సంఘం మల్కాజిగిరి