కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి): అక్రమార్కుల చెర నుంచి చెరువులు, కుం టలు, ప్రభుత్వస్థలాలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కాకముందే గతంలో కాంగ్రెస్ 2030 వరకు హెచ్‌ఎండీఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందని గుర్తుచేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మట్లాడుతూ.. తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అక్రమ నిర్మాణాలకు మద్దతు ఇచ్చిందని విమర్శించారు.
హైడ్రా ఏర్పాటు చేసి ప్రజలు మన్నన లు పొందుతున్న సీఎం రేవంత్‌పై ఎంఐఎం, బీఆర్‌ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేయడం సరికాదన్నారు. హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాలని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లెస్ రోడ్డు ఏర్పాటు చేశారని వివరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి నీటిని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారేనని, 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు స్పష్టంచేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.