calender_icon.png 11 March, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

11-03-2025 01:07:49 AM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం అసిఫాబాద్,మార్చి 10(విజయ క్రాంతి):  వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భువన సమావేశ మందిరంలో జిల్లా అదనప కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మాసాడి రాజేశ్వరి తన పట్టా భూమికి కొలతలు జరిపి హద్దులు నిర్ధారించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు ఎన్. టి. ఆర్. సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన చాపిడి శంకర్ తన పట్టాభూమి నిషేధిత జాబితాలో ఉన్నందున తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామానికి చెందిన చౌదరి ఓంకార్ దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన నికోడే లచ్చుంబాయి తాను సాగు చేస్తున్న భూమికి బట్ట మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన నక్కా గజానంద్ తాను రైతు వేదికలో తాత్కాలిక వాచ్ మెన్ గా పనిచేసిన కాలానికి జీతం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

కౌటాల మండల కేంద్రానికి చెందిన దుర్గం శంకర్ తనకు సదరం శిబిరంలో దివ్యాంగుడిగా ధృవపత్రం జారీ చేయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వాంకిడి మండలం డాబా గ్రామానికి చెందిన మురళి మహేందర్ తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువుగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.