జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...
మనకొండూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ వేదికపై తమ ఉపన్యాసాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) ఆకాంక్షించారు. గన్నేరువరం మండలం జంగపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో "టెడ్ ఎడ్ స్టూడెంట్స్ టాక్స్ క్లబ్" ను, విద్యార్థుల అవగాహన కోసం ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జంగపల్లి ప్రభుత్వ పాఠశాల టెడ్ ఎడ్ కోచింగ్ కోసం గుర్తింపు పొందిన రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ పాఠశాల అని చెప్పారు. ఈ గుర్తింపు వెనుక ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి ఉందని తెలిపారు. ఈ శిక్షణ ప్రభుత్వ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మార్గం చూపుతుందన్నారు. విద్యార్థులంతా టెడ్ ఎడ్ లో పాల్గొనాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగ సాధనకు భావవ్యక్తీకరణ చాలా ముఖ్యమని అన్నారు. టెడ్ వేదికపై ప్రభుత్వ విద్యార్థి సత్తా చాటి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. తద్వారా భవిష్యత్తులో జరగబోయే పోటీలకు మరింతమంది ముందుకు వస్తారని సూచించారు.
ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధతో ఏదైనా సాధ్యమేనని తెలిపారు. టెడ్ ఎడ్ లో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించే సినిమాలను చూపించాలని, ఆ సినిమాపై విద్యార్థుల అభిప్రాయాన్ని పేపర్ పై రాయించాలని సూచించారు. ఈ సందర్భంగా జంగపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను సూచించే పిపిటిని కలెక్టర్ తిలకించారు. మత్తు పదార్థాలు, స్నేహిత, నషా ముక్త భారత్, కుక్కకాటు-జాగ్రత్తలు, కిచెన్ గార్డెన్, ఫోక్సో చట్టం వంటి వాటిపై విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. రామ్ చరణ్ అనే విద్యార్థి గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్ కు అందజేశారు. అనంతరం పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. వంటగదిని, పంట పాత్రలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారి రామయ్య, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు కే.శారద పాల్గొన్నారు.