03-04-2025 08:02:01 PM
జాతీయ రహదారిగా అభివృద్ధి చేయండి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేంద్ర మంత్రులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. అదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, నిర్మల్, సిర్పూర్, అదిలాబాద్, ముధోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, పవర్ రామారావు పటేల్ వారి వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను మంత్రులు నితిన్ గడ్కారీ(Union Minister Nitin Gadkari), రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) లకు వివరించారు. బాసర-మాహుర్ జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీను విన్నవించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బాసర నుండి మాహుర్ కు జాతీయ రహదారికీ అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పంపాలని కోరిన విషయం విధితమే. అందులో భాగంగా జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ముధోల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో సిఐఆర్ఎఫ్ నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా బాసర వంతెన ఆత్మహత్యలకు నిలయంగా మారిన తరుణంలో నిధులు కేటాయించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అదిలాబాదులో నూతనంగా ఎయిర్ పోర్ట్(Airport) మంజూరు చేయడంతో రామ్మోహన్ నాయుడును శాలువాతో సత్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి నితిన్ గడ్కారీకి వినతిపత్రం అందజేశారు.