calender_icon.png 26 December, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

02-12-2024 05:00:10 PM

సర్వే డేటా ఎంట్రీ వేగంగా పూర్తి చేయాలి...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు..

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ.వెంకటేశ్వర్లు, ఆర్డివో సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు  సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 32 ఫిర్యాదులు వచ్చినట్లు ​కలెక్టర్ ​తెలిపారు.

సర్వే డేటా ఎంట్రీ వేగంగా పూర్తి చేయాలి

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఫారం లను ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా, నాణ్యతగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. ప్రతిరోజు డేటా ఎంట్రీ టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. ఫారమ్స్ ను చాలా జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిసెంబర్ 9 తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.