calender_icon.png 2 March, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర ప్రజా ఉద్యమాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం..

01-03-2025 09:16:50 PM

ఎస్ యు సి ఐ (కమ్యూనిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కే. శ్రీధర్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, కార్మికులు, రైతులు తీవ్రంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఎస్ యు సి ఐ (కమ్యూనిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కే. శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో ఎస్ యు సి ఐ (కమ్యూనిస్టు) పార్టీ  ఆధ్వర్యంలో ప్రజలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న సమస్యలను ప్రభుత్వాలు వెంటనే   పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ యు సి ఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె. శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, కార్మికులు, రైతుల తీవ్రంగా శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కి యువత పెడతోవపడుతున్నారని అన్నారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషవలయం నుంచి బయట పడాలంటే ప్రజలంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహించడం ఒక్కటే ఏకైక మార్గమని ఈ సందర్భంగా శ్రీధర్ స్పష్టం చేశారు. ఇటీవల కర్ణాటకలో ఆశా వర్కర్స్ చేసిన హక్కు ఉద్యమ విజయమే దీనికి సరైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న SUCI (కమ్యూనిస్టు) రాష్ట్ర కార్యదర్శి శ్రీ సీహెచ్. మురహరి మాట్లాడుతూ... సమాజం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని,నీతీ, నైతిక విలువలు పతనమై, మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంలా వెంటాడుతోందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ సమాజంలో అశాంతిని రెచ్చగొడుతోందనీ, పెరుగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రదలంతా కలిసికట్టుగా 

ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపెనీలకు కొమ్మకాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 8వేలకు పైగా కోట్ల స్కాలర్షిప్ లను పెండింగ్ లో పెట్టిందని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ దర్నా కార్యక్రమానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రం వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో SUCI (కమ్యూనిస్టు) హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పి. తేజ అధ్యక్షత వహించిన ఈ ధర్నా లో రాష్ట్ర కమిటీ సభ్యులు జానీబాషా, భరత్, గంగాధర్ తో పాటుSUCI (కమ్యూనిస్టు) కార్యకర్తలు, ఏఐడీఎస్ఓ, ఏఐడీవైఓ, ఏఐఎంఎస్ఎస్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.