12-03-2025 07:45:11 PM
పెండింగ్ పనులపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించేనా ..?
కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా
అసంపూర్తిగానే భవనాలు
కామారెడ్డి/జుక్కల్,(విజయక్రాంతి): వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో గత ప్రభుత్వం రూర్బన్ పథకాన్ని జిల్లాకు మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన జుక్కల్ మండలంలో రూర్బన్ పథకాన్ని అమలు చేయడానికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. పలు అభివృద్ధి పనులు భవన నిర్మాణ పనులు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూర్బన్ పథకంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు నిర్మించారు. మరికొన్ని భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పూర్తి అయిన కొన్ని భవనాలు ఉపయోగంలో లేకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. 2018లో రూర్బన్ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండలం ఎంపికైంది. ఈ పథకంలో భాగంగా కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం రూర్బన్ పథకం కింద మంజూరు చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలతో పాటు గోదాముల నిర్మాణం చేపట్టింది. రూరుబన్ కింద కోట్ల రూపాయల నిధుల ప్రజాధనం వృధా అయినట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మారుమూల మండలం అభివృద్ధి చెందాలని సంకల్పంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు అప్పటినుంచి నిర్మించిన ఏ ఒక్క భవన నిర్మా ణం పూర్తి కాకపోవడం, పూర్తయిన భవనాలు ఉపయోగంలో లేకపోవడంతో ఎంతో ఆశయంతో రూర్బన్ పథకం మంజూరు చేసి కోట్ల నిధులు మంజూరైనప్పటికీ పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాకపోవడంతో మండల ప్రజలకు నేటికీ ఉపయోగంలోకి రాలేదు.
జిల్ అప్పటి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యే హనుమంతు షిండే ఈ పథకానికి ఎంతో కృషి చేశారు. మండల కేంద్రంలో కోటి 20 లక్షలతో నిర్మాణం చేపట్టిన ఆడిటోరియం ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలి ఉంది. అసంపూర్తిగా ఉండడంతో ఆడిటోరియంకి మరిన్ని నిధులు మంజూరు చేశారు. ఇప్పటికీ కూడా ఆడిటోరియం భవన నిర్మాణం పనులు పూర్తి కాలేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత లాగా నిలిచిపోయాయి. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా రూర్బన్ పథకం కింద నిర్మించిన పెండింగ్ పనులపై దృష్టి సారించకపోవడం తో పనులు ఆగిపోయాయి. రూర్బన్ పథకంలో గత ఏడు సంవత్సరాల క్రితం 2018 నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పథకం రెండు సంవత్సరాల వ్యవధిలో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి జరగాలనేదే రూర్బన్ (రూ+అర్బన్) పథకం ముఖ్య ఉద్దేశం. కానీ అప్పటి (మాజీ ) ఎమ్మెల్యే చూసి చూడనట్లు వ్యవహరించడంతో పనులు సకాలంలో పూర్తి కాలేకపోయాయని ప్రజలు విమర్శిస్తున్నారు. రూర్బన్ పథకంలో చేపట్టిన పనుల్లో పలు గ్రామాల్లో నిర్మించిన బస్ స్టాప్ లు మాత్రమే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి. మిగతావి గోదాములు, అంగన్వాడి భవనాలు, రైతు వేదికలు, ఆడిటోరియం, ఆక్సిజన్ పార్కు, ట్రైనింగ్ సెంటర్ భవనాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇందులో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని పట్టించుకునే నాధుడే లేడా అని ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు.
జుక్కల్ మండలంలోని పడంపల్లి, హంగర్గా, పెద్ద గుల్ల, మహ్మదాబాద్ గ్రామాల్లో నిర్మించిన గోదాంలు ఉపయోగంలో లేక పెచ్చులు ఉడుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గత ప్రభుత్వం లో చేపట్టిన పనులకు వారు నిర్లక్ష్యం వహించగా ప్రస్తుతం ఉన్న ప్రజా నిధులు ,కలెక్టర్ వీటిని పట్టించు కోవాలని అర్ధాంతరంగా నిర్మించిన భవనాలను ఉపయోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉపయోగం లోకి లేకపోతే వృధాగా శిథిలావస్థలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. రూర్బన్ పథకం ఆశయం నీరు గారే అవకాశాలున్నాయి. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు రుర్బన్ పథకంలో నిర్మించి పెండింగ్ లో ఉన్న పనులపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కోట్ల రూపాయలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పార్లమెంట్ సభ్యుడు సురేష్ షట్కార్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక ప్రజాప్రతి నిధులది జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ ప్రత్యేక చొరవ చూపి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జుక్కల్ మండల ప్రజలు కోరుతున్నారు. పనులు పూర్తయితే మారు మారుమూల మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రూర్బన్ పథకం కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.