- పెద్ద అంబర్‌పేట్‌లో ప్రజాప్రతినిధుల లీలలు
- ఉన్న సీసీ రోడ్లను తొలగించి.. కొత్త రోడ్ల నిర్మాణం
- అండర్ డ్రైనేజీ లేకుండా.. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు
- కౌన్సిలర్ల తీరుపై స్థానికుల ఆగ్రహం
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 3: పెద్దఅంబర్‌పేట్ కౌన్సిలర్లు కూడబలుక్కుని ప్రజాధ నాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేకపోయిన ఉన్న సీసీ రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. ఒకవైపు మున్సిపాలిటీ ప్రజలు ఎన్నో మౌలిక వసతులు డిమాండ్ చేస్తుంటే, అనవసర రోడ్లు నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డు నిర్మించే ముందు అవసరమైన చోట అండర్ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మించాల్సి ఉండగా కౌన్సిలర్లు ఆ పని కూడా చేయడం లేదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇటీవల అన్నారంలో పలు కాలనీ అసోసియేషన్లతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో వివిధ కాలనీలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీల వాసులు తమ కాలనీల్లో కచ్చితంగా అండర్ డ్రైనేజీ పైప్‌లైన్లు ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే తక్షణం స్పందించి అందుకు అనుగుణంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
వాటిని బేఖతార్ చేస్తూ ఇప్పుడు సీసీ రోడ్లు నిర్మిస్తుండడంతో స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 6వార్డులో రోడ్డు బాగానే ఉండగా, ఆ రోడ్డును తొలగించి ఆగమేఘాలమీద రోడ్డు నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ నిధులతో వారి సొంత రిసార్ట్‌లకు సీసీ రోడ్లు వేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
18వ వార్డు ఆర్కే నగర్‌లో అండర్ డ్రైనేజీ లేకుండానే సీసీ రోడ్లు వేశారంటున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్ల నాణ్యత విషయంలోనూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రు. సాధారణంగా రోడ్ల నిర్మించే ముందు 6 ఎంఎం కంకర పరచాల్సి ఉండగా, అదేమీ లేకుండానే సీసీ రోడ్లు నిర్మించడమేంటని నిలదీస్తున్నారు.
నాణ్యత లేదు
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు బాగానే ఉన్నటికీ, కౌన్సిలర్లు మళ్లీ సీసీ రోడ్లు వేస్తున్నారు. అలా నిర్మించడంతో ఇండ్లు కిందికై, రోడ్లుపైకి వస్తున్నా యి. ఇలా అయితే వర్షం వచ్చినప్పుడు వరద నీరంతా ఇండ్లలోకి చేరుతుంది. కొత్తగా వేసే రోడ్ల విషయంలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నాసిరకంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారన్నారు. ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారు. 6 ఎంఎం కంకర వాడకుండా రెడ్ మిక్స్ వంటి పదార్థాలు వినియోగిస్తున్నారు.
యంజాల ప్రహ్లాద్,
పెద్ద అంబర్‌పేట్
ఓట్ల కోసం అయితే వస్తరు..
మున్సిపల్ పరిధిలో కొత్త ఏర్పడిన కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షం వస్తే చాలు రోడ్లన్నీ చిన్న పాటి చెరువుల్లా దర్శనిమిస్తున్నాయి. కాలనీల్లో మాకు కనీస సదుపాయాల్లేవు. రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టకున్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం నాయకులు ఇంటింటికీ వస్తారు. గెలిచిన తర్వాత పట్టించుకోరు.
పాషా, శ్రీనగర్ కాలనీ వాసి