calender_icon.png 25 November, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాహితాకాంక్షి బద్దెన

25-11-2024 12:00:00 AM

“వినదగు నెవ్వరు చెప్పిన

విని నంతనె వేగ పడక వివరింప దగున్

గనికల్ల నిజము దెలిసిన

మనుజుడెపో! నీతిపరుడు మహిలో సుమతీ!”

నీతిపరుడైన మనిషి ప్రవర్తనా పద్ధతిని, ఆలోచనా విధానాన్ని అత్యంత సరళమైన శైలిలో వివరించిన ఈ పద్యం అందరి నోళ్లలో నానే ‘సుమతీ శతకం’ లోనిది. తెలుగు శతక సాహిత్యం అంటేనే స్ఫురించే శతకాల్లో సుమతీ శతకం ఒకటి. ఒక తరం కింది వరకూ ప్రతి ఒక్కరూ పసితనంలో ప్రతి వానికీ నేర్పించే ముఖ్యమైన శతకాల్లోనూ ఇదొకటి.

‘సుమతీ శతకం’లో చెప్పని నీతికాని, లోక రీతికాని లేవనే చెప్పవచ్చు. చెప్పింది 100 పద్యాలే అయినా ప్రతి ఒక్కటీ మానవునికి ఉపయోగపడే ఒక ఆణిముత్యం. అటువంటి గొప్ప శతకాన్ని రచించిన కవియే బద్దెన. ఈయనే భద్రభూపాలుడు అనే ఒక చిన్న సామంతరాజు. 

సరళమైన కందపద్యాలతో ‘సుమతీ శతకం’

కాకతీయుల కాలం వానిగా గుర్తించిన బద్దెన జీవించిన కాలం క్రీ.శ. 1250 ప్రాంతంగా చరిత్రకారులు భావించారు. ఈయన రచించిన ‘సుమతీ శతకం’ పండితులకే కాదు, పామరులకు కూడా ప్రీతిపాత్రమైంది. సమాజానికి అవసరమైన నైతిక విలువలను, మానవ ప్రవర్తనా నియమాలను, జీవన విధానాలను సరళమైన కంద పద్యాలలో అందించిన విశిష్టమైన శతకం. అక్షర జ్ఞానం లేని వాని నోటకూడా అద్భుతంగా వినిపిస్తుంది.

“ఆబాల గోపాలానికి సుపరిచితమైన నీతిసూక్తులు, సార్వకాలీనములు, సార్వజనీనములు అయిన నిత్య సత్యాలు” అన్న ఆచార్య ఎస్.వి.రామారావు మాటలు బద్దెన పద్యాలను పరిశీలిస్తే ఎంత సత్యవాక్కులో అర్థమవుతాయి. అందరి నోళ్లలో నానే మరొక పద్యం-

“అప్పిచ్చువాడు, వైద్యుడు

యెప్పుడు యెడతెగక పారు యేరును, ద్విజుడున్

జొప్పడిన యూర నుండుము

చొప్పడ కున్నట్టి యూరు జొరకుము సుమతీ!”

ఇందులో కవి మానవ జీవితావసరాలను గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. “మనిషి ఎక్కడైనా, ఏ ఊళ్లోనైనా నివసించవచ్చు, కానీ అది అతని ప్రాథమిక అవసరాలున్న ఊరై ఉండాలి. ఆ ఊళ్లో ఎప్పటికీ ఎండిపోని నీళ్లున్న నది లేదా కాలువ, జ్ఞానాన్ని బోధించే ద్విజుడు, అప్పు పుట్టే అవకాశం, రోగం వస్తే బాగు చేసే వైద్యుడు మాత్రం తప్పకుండా ఉండాలి.

ఇవి మనిషి కనీసావసరాలు. తాను నివాసం ఉండబోయే గ్రామంలో ఇవి ఉన్నాయా లేదా అని చూసుకోవలసిన బాధ్యత నివసించబోయే వ్యక్తిదే. కనుక, వారు దీన్ని తెలుసుకోవాలి” అని బద్దెన ఈ పద్యం ద్వారా బోధించాడు.

జీవన అవసరాలు తీర్చేలా..

‘సుమతీ శతకం’లోని చాలా పద్యాల్లో గ్రామీణ జీవన వ్యవస్థకు కావలసిన అవసరాలను అనేక విధాలుగా కవి చెప్పే ప్రయత్నం చేశాడు. వ్యావసాయికమైన, పటిష్ఠమైన గ్రామీణ వ్యవస్థను కలిగి వున్న సమాజంగా మన దేశానికి గుర్తింపు ఉంది. అటువంటి చోట ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. దీనిని గుర్తించిన కవి-

“వురికిని ప్రాణము కోమటి

వరికిని ప్రాణంబు నీరు, వసుమతి లోనన్

గరికిని ప్రాణము తొండము

సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ!”

అన్నాడు మరో పద్యంలో. ఏ గ్రామానికైనా వర్తకుడు ప్రాణం వంటివాడు. అంటే, గ్రామ వ్యవస్థకు వ్యాపారం, వ్యాపారి మూలాధారాలన్నమాట. ఏనుగుకు తొండం ఎంత ముఖ్యమో గ్రామానికి వ్యాపారస్థుడు అంత ముఖ్యమన్నమాట. ఇంటి ఇల్లాలే సిరిసంపదలకు మూలం. గృహ ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంలో ఉంచగల శక్తి ఇంటి ఇల్లాళ్లకే సాధ్యం. యజమాని సంపాదించిన ధనాన్ని సక్రమంగా, సమర్థంగా ఉపయోగించి కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి ఆమెయే గనుక ‘సిరికిని ప్రాణంబు మగువ’ అని నిర్ధారించాడు బద్దెన.

మరో గొప్ప రచన ‘నీతిశాస్త్ర ముక్తావళి’

సుమతీ శతక కారుడైన ఈ బద్దెనయే మరొక గొప్ప రచన కూడా చేశాడు. అదే ‘నీతిశాస్త్ర ముక్తావళి’. అత్యంత విశిష్టమైన ఈ రచన సమాజోపకారిగా గుర్తింపు పొందింది. బద్దెనయే భద్రభూపాలుడని, అతడొక పాలకుడని తెలిపే రచన ఇది. ఇందులోని పద్యాల్లో ‘బద్దెనరేంద్రా!’ అని తనను తాను సంబోధించుకున్న దాన్నిబట్టి కూడా “ఇతడొక రాజు” అని సాహితీవేత్తలు భావించారు.

ఇందులోని పద్యాలు ఎక్కువగా పాలకులకు ఉపయోగ పడేవిగా కనిపిస్తున్నాయి. మంత్రులను ఎన్నుకోవడం, సత్కార్యాలను గురించి విచారణా పద్ధతులు, అధికారంలో తాను చేయవలసిన విధులు, దుష్టమంత్రులవల్ల రాజ్యానికి కలిగే నష్టాలు, ప్రమాదాలు, హితులైన సేవకులవల్ల కలిగే లాభాలు వంటివాటిని మొత్తం 12 భాగాలుగా విభజించి పద్యాలుగా రాశాడు.

ఈ శీర్షికల కిందనే ‘నీతిశాస్త్ర ముక్తావళి’ని నిబద్ధించాడు బద్దెన. మొదటి పద్యంలోనే తాను ‘సుమతీ శతకాన్ని’ రచించిన వాడినే అని చెప్పుకున్నాడు. ఈ కారణంగా కొంతమంది సాహితీవేత్తలు భావించినట్లుగా ‘ఈ బద్దెన, సుమతి శతక కర్త బద్దెన వేర్వేరు’ అన్న ఆలోచనకు సమాధానం లభించింది.

పాలకులకు మార్గనిర్దేశనం

“శ్రీ విభుత గర్వితారి

క్ష్మావర దళనోపలబ్ధ జయలక్ష్మీ సం

భావితుడ సుమతి శతకము

గావించిన ప్రోడ గావ్యగమలాసనుడన్‌”

అని చెప్పిన పద్యం ఆయనకు కమలాసనుడనే బిరుదు, అంటే ‘కవిబ్రహ్మ’ బిరుదు ఉన్నదని సాహిత్య చర్రితకారులు అభిప్రాయపడ్డారు. ఇందులోని ఈ 15 అంశాలలో బద్దెన “రాజోచిత నీతులొప్ప” రచించానని చెప్పుకున్నాడు. అంతేగాక, ఆయన పాలకుడు గనుక “న్యాయము ప్రజ పెక్కునకును” పద్య రచన చేసినట్లు, అదే విధంగా “ప్రజ కల్మిసిరి కుపాయము”గా ఈ రచనకు పూనుకున్నట్లు స్పష్టపరిచాడు. పాలకునిగా తన బాధ్యతలను ఈ రచనద్వారా తెలిపినట్లయింది. ‘కావ్య విచార పద్ధతి’ శీర్షికలో-

“పరశక్తియు, నిజశక్తియు

బరికింపక దొడరుటెల్ల భంగమునకు బ

ట్టొరులందు దన్నునెఱగుట

పరమ జ్ఞానంబు బద్దెనరేంద్రా!”

అంటూ ఎదుటి వాని శక్తి, తన శక్తి తెలుసుకోకుండా ముందుకు సాగితే అన్ని పనులు భంగమవుతాయని అంటూనే, ముందు తనను తాను తెలుసుకోవాలని, అదే గొప్ప జ్ఞానమని బల్లగుద్ది చెప్పాడు. ఇది కేవలం పాలకులకే కాదు, ప్రతి వ్యక్తికీ అవసరమైన జ్ఞానమే. 

అదే విధంగా కోపం, ప్రాసాద గుణాలను గు రించి చెబుతూ, ‘దుష్టరాజ సేవనము’

 శీర్షికలో-

“కోప ప్రాసాదములలో

గోపమె చూపుచు ప్రాసాద 

గుణమయ్యెడలన్

జూపని నరపతి గొల్చిన

పాపమునకు మేరయెద్ది బద్దెనరేంద్రా!” 

అన్నాడు. ‘కోపమే తప్ప శాంతగుణం లేని రాజులను సేవించడమే మహాపాపం. ఆ పాపానికి హద్దే లేద’ని అన్నాడు. పాలకులలో కోపం ఉండరాదన్న భావంతో ఈ పద్యం రచించినట్లు కనిపిస్తున్నది. ‘సుమతీ శతకం’లోని “తన కోపమె తన శత్రువు..” అన్న పద్యం పాఠకునికి స్ఫురించే విధంగా ఈ పద్యం ఉండటం.. ఈ రెండు రచనలూ బద్దెనవే అనడానికి మరొక బలమైన ప్రమాణంగా కనిపిస్తున్నది.

మనిషికి ఎన్నో బలహీనతలు ఉంటాయి. ముఖ్యంగా ఎదుటివానిలోని తప్పులు ఎప్పుడూ ఎత్తి చూపే తత్తం కలవాళ్లు చాలామందే ఉంటారు. అందుకే, ‘అసద్రాజ పద్ధతి’ అనే శీర్షికలో-

“పరదోష కథ వినోదము

పరపీడో త్పాదనంబు, బలిమి పర స్త్రీ

హరణమె సుఖముగ మనుపతి

పరమోత్పాతంబు ప్రజకు బద్దెనరేంద్రా!” 

అంటూ చెప్పిన పద్యం ‘పాలకులలో ఉండకూడని’ విషయాలను గురించి వివరించింది. భద్రభూపాలుడు (బద్దెన) సమర్థుడైన పాలకుడని, ప్రజారంజకంగా పాలించిన వాడన్న విషయం కూడా దీనిద్వారా మనకు అవగతమవుతుంది. ఇవన్నీ పాలకులను ఉద్దేశించి చెప్పినా, ప్రతి వ్యక్తికూడా ఇటువంటి అవగుణాలకు దూరంగా ఉండాలన్నదే కవి భావనగా తెలుస్తున్నది.

సులభ శైలిలో పద్యాల రచన

మనిషి మనస్తత్వం విచిత్రమైంది. ఒక్కోసారి అతను అహంకారంతో వ్యవహరిస్తూ అన్నింటా తానే బలవంతుడనని, అందరూ తన మాటే వినాలని భావిస్తుంటాడు. ఈ విధమైన భావాన్ని వదిలెయ్యాలన్న సందేశాన్ని అందిస్తూ-

“బలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుటమేలా?

బలవంతమైన సర్పము

చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!”

అన్న పద్యాన్ని రచించాడు. “తాడి దన్నేవాడి తల దన్నేవాడు” ఉంటాడన్న సామెతను గుర్తు చేస్తున్న ఈ పద్యం మనుషులు ఈ రకమైన తమ ప్రవర్తనను మార్చుకోవాలని బోధిస్తున్నది. “ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఎవరికీ అహంకారం పనికిరాదు. ఒక్కోసారి ఆ అహంకారమే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది” అంటూ మనందరికీ తెలిసిన దృష్టాంతాన్ని చెప్పాడు. ‘చీమల చేతిలో పడి ప్రాణాలు కోల్పోయే బలవంతమైన సర్పం పొందిన దురవస్థ’తో ఈ అహంకారం తెచ్చిపెట్టే అనర్థాన్ని పోల్చి చెప్పాడు. జీవన నీతిని పాఠకునికి ఇంత సులభంగా హృదయగతం చేసిన బద్దెన కవి ప్రతిభ అనన్య సామాన్యం.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448