హైదరాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి) : ఈ నెల 18వ తేదీ నుంచి 26 వరకు జిల్లాల్లో బీసీ కమిషన్ రెండో విడత బహిరంగ విచారణ చేపట్టనున్నది. విద్య, ఉద్యోగపరంగా బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా ప్రజలు, కుల సంఘాలు వినతులు, సలహాలు ఇవ్వాలని బీసీ కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించింది.
ఇప్పటికే తొలి విడతగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండలో పర్యటించగా, తాజాగా 18 నుంచి 26 వరకు మిగిలిన 5 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నది. 18న నల్గొండ, 19న ఖమ్మం, 21న రంగారెడ్డి, 22న మహబూబ్‌నగర్, 23న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం చేపట్టనున్నది.
జిల్లా కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ విచారణకు హాజరు కాలేనివారు ఈనెల 25, 26వ తేదీల్లో ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావచ్చని కమిషన్ తెలిపింది. వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు పోస్టు ద్వారా కమిషన్ కార్యాలయానికి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వినతులు పంపించవచ్చని సూచించింది.