- రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- కొర్లపహాడ్ వద్ద ట్రామాకేర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నల్లగొండ, జూలై 8 (విజయక్రాంతి): ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఆయన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందించేందుకే రూ.5 కోట్ల ఏడీపీ సంస్థ సహకారంతో ట్రామా కేర్ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. మూసీ కాల్వలను పునరుద్ధరించి జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచుతామన్నా రు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ కార్యదర్శి దాసరి హరిచందన, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, శానసమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు.