20-03-2025 06:48:36 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు...
జుక్కల్ (విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులకు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సూచించారు. 2025-2026 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేయిస్తున్నానని తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నామని చెప్పారు.
రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా పని చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి సత్తా చాటాలని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకొని పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.