ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి
చెన్నూర్ (మంచిర్యాల), జూలై 5 (విజయక్రాంతి): ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకువచ్చిందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని జైపూర్, భీమారం మండలాల్లో నిర్వహించి వన మహోత్సవంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. రాష్ట్రప్రభుత్వ హామీల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను విజయవంతం గా అమలు చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు.
నిజమాబాద్ జగ్దల్‌పూర్ నేషనల్ హైవే 63లోని జోడువాగుల వద్ద రోడ్డు నిర్మాణానికి రూ.15 నిధులు వచ్చాయని, అటవీ శాఖ అనుమతి లేకపోవడంతో పనులు చేయడం లేదన్నారు. దీనిపై ఇటీవల ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామని గుర్తుచేశారు. జాతీయ రహదారి అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని కోరగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. మరో కేంద్ర మంత్రి ఉపేందర్ యాదవ్‌ను కలిసి అటవీ ప్రాంతంలో రోడ్డుకు అనుమతివ్వాలని కోరామన్నారు. రైతులకు పట్టాలిచ్చిన తర్వాత సేద్యం చేయకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నా రని, తప్పుడు పట్టాలని అధికారులు చెబుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం భీమారంలో ఎంపీపీ భవన నిర్మాణానికి, నర్సింగాపూర్‌లో రూ.1.6 కోట్లతో నిర్మించే 5 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.