calender_icon.png 25 February, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరా నిఘాలో పబ్లిక్ పరీక్షలు

25-02-2025 12:00:00 AM

పకడ్బందీగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు 

ఖమ్మం, ఫిబ్రవరి- 24 (విజయక్రాంతి) : రాబోయే ఇంటర్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తుత ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

వీటి నిర్వహణ కు గాను జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లాలో ఇంటర్  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 72, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 97 పరీక్ష కేంద్రాలను  సిద్ధం చేస్తున్నారు.

పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 6వ తారీఖున ఒక సెట్,10వ తారీఖున రెండవ సెట్ ప్రశ్నా పత్రాలు జిల్లాకు వస్తాయి.వీటిని ట్రెజరీ రూమ్ లో  భద్రపరిచి, జిల్లాలో 6 రూట్ లలో ప్రశ్నా పత్రాలను పటిష్ట బందోబస్తు మధ్య తరలిస్తారు.10వ తరగతి పరీక్షలకు 6 ఫ్లుయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేస్తున్నారు.ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో సిట్టింగ్స్ స్క్వాడ్ ఉంటుంది.

ప్రశ్నా పత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను రవాణా శాఖ అధికారి ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి తాగునీటి సరఫరా ఉండేలా మున్సిపల్ అధికారులు లేదా గ్రామీణ నీటి సరఫరా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.