18-03-2025 01:00:46 AM
కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 17 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు యుద్ధప్రాతిపదికన పరిష్కారం చూపాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సంబంధిత శాఖలను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ’ప్రజావాణి’లో కలెక్టర్, ముఖ్య అధికారులు స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకుని వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రజావాణిలో విన్నవించుకుంటే తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారని, ప్రజలు ఎంతో నమ్మకంతో వస్తారని గుర్తు చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నేటి ప్రజావాణిలో మొత్తం 35 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా సమన్వయంతో పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూధన్, జివాకర్’రెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ పాలనాధికారి హకీం, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.