calender_icon.png 8 January, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

02-12-2024 06:50:05 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆర్టీఓ లోకేశ్వర్ రావుతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన బొర్కుట జగ్గయ్య తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. సిర్పూర్-టి మండలం లోనవెల్లి గ్రామానికి చెందిన బండారి పీతాంబర్ తన తల్లి పేరిట ఉన్న పట్టా భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం రొంపల్లి గ్రామానికి చెందిన కోలం గిరిజనులు తమకు ఇండ్ల నివాస స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఆసిఫాబాద్ మండలం రాజురా గ్రామానికి చెందిన చిలం బుచ్చయ్య తనకు రైతు రుణమాఫీ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన దావునే మనీషా తనకు ఉన్నత చదువుల కొరకు ల్యాప్ టాప్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం నాయకపు గూడ గ్రామానికి చెందిన మెండ్రపు లక్ష్మి తన భర్త పేరిట ఏదులపాడ్ గ్రామ శివారులో గల పట్టా భూమిని ఇతరులు అక్రమంగా తమ పేరిట మార్చుకున్నారని, ఇట్టి పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైనూర్ మండలం జన్సుగూడ గ్రామానికి చెందిన ఆత్రం అనసూయబాయి తనకు ఆసరా పెన్షన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

చింతల మానేపల్లి మండలం రణవల్లి గ్రామానికి చెందిన గోరె లావణ్య తాను 10వ తరగతి చదువుతున్నానని, చెవిటి, మూగ వైకల్యం కలిగి ఉన్నానని, తన సదరం ధ్రువపత్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.