calender_icon.png 18 March, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

17-03-2025 10:20:10 PM

బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చర్యలు... 

సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై చర్య తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సోమవారం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రతను, తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్లను పరిశీలిస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని యస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. 

జిల్లాలో అధికంగా పటాన్ చెరు, అమీన్పూర్ ప్రాంతాలలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ నేరాలలో విద్యావంతులే అధికం అని సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉద్యోగుల తాకిడి, స్కూల్స్, కళాశాల బస్సుల వలన అధిక ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, దీనిని అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్ లైన్ బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ.. అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది 24/7 హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఎస్పి వెంట పోలీసు అధికారులు ఉన్నారు.