25-04-2025 02:29:51 AM
సూర్యాపేట,ఏప్రిల్24(విజయక్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో దరఖాస్తుల డాటా ఎంట్రీకి సంబంధించిన డబ్బులు అందలేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 475 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 3,62,203 దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో ఆరు రోజుల వ్యవధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఆపరేటర్లను అంతా కలిపి సుమారు 1,350 మందితో రేయింబవళ్లు పని చేయించి దరఖాస్తులను ఆన్లైన్ చేయించారు.
ఒక్కో దరఖాస్తు ఆన్లైన్ చేసినందుకుగాను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7, ప్రైవేట్ ఆపరేటర్లకు రూ.15 చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. దాదాపు రూ.32 లక్షల బకాయి ఉన్నట్లు తెలిసింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేయకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.
నెలల గడుస్తున్న అందని డబ్బులు
రాష్ట్రంలోని దాదాపు అన్ని కుటుంబాలు, వారి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించింది. దాని తరువాత గత ఎన్నికల్లో గెలిచి రా్రష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పరిధిలోని 23 మండలాలు, 475 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీల నుంచి 3,62,203 దరఖాస్తులను స్వీకరించారు. కాగా జనం నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించారు. ఆన్లైన్ చేసినందుకు గాను ప్రతి దరఖాస్తుకు ప్రైవేట్ వారితో చేయిస్తే రూ.15, ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేసే ఆపరేటర్లకు రూ.7 చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.
కానీ.. దరఖాస్తుల ఆన్లైన్ ముగిసి నెలలు గడుస్తున్న డబ్బులు మాత్రం అందలేదు. డే వన్ నుంచి మూడు షిఫ్ట్లో్ల రేయింబవళ్లు ఆన్లైన్ చేయగా వారికి సుమారు రూ.32లక్షలు రావాల్సి ఉన్నది. కాగా తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు .