calender_icon.png 21 December, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కివీస్‌తో పోరుకు సై

16-10-2024 12:37:43 AM

నేటి నుంచి తొలి టెస్టు 

  1. రోహిత్, కోహ్లీ ఫామ్‌పై నజర్ 
  2. మ్యాచ్‌కు వర్షం ముప్పు

53-టెస్టుల్లో 9వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కోహ్లీకి అవసరమైన రన్స్

36-భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచి 36 ఏళ్లు కావొస్తోంది. చివరిగా 1988లో ముంబై టెస్టులో కివీస్ విజయం సాధించింది.

బెంగళూరు: టీ20 ప్రపంచకప్ అనంతరం విరామాన్ని ఎంజాయ్ చేసిన భారత క్రికెట్ జట్టు ఇటీవలే వరుస సిరీస్‌లతో బిజీగా మారింది. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

బంగ్లాతో ఆడిన జట్టునే టీమిండియా దాదాపు కొనసాగించే అవకాశముంది. మరోవైపు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2 కోల్పోయిన న్యూజిలాండ్ ఒత్తిడిలో ఉంది. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయంతో తొలి టెస్టుకు దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ.

టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ భారత స్పిన్‌ను తట్టుకొని ఏ మేర ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరం. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం రోజు మొత్తం వర్షం పడడంతో ఇరుజట్లు హోటల్ రూమ్‌కే పరిమితమయ్యాయి.

ఫామ్‌లోకి రావాల్సిందే..

టీమిండియా బ్యాటింగ్ విభాగంపై పెద్దగా ఆందోళన లేదు. అయితే జట్టులో అత్యంత సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించాల్సిన అవసరముంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు టెస్టులు కలిపి రోహిత్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది కోహ్లీ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి ఒక అర్థసెంచరీ సాధించలేకపోయాడు.

ఇక రోహిత్ 15 ఇన్నింగ్స్‌లు కలిపి రెండు సెంచరీలు, ఒక అర్థసెంచరీ సాయంతో 497 పరుగులు మాత్రమే సాధించాడు. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు కోహ్లీ, రోహిత్‌లకు రాణించేందుకు మంచి అవకాశం. ఇక ఓపెనర్ జైస్వాల్, గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు అశ్విన్, జడేజాలు అదరగొడుతున్నారు.

చిన్నస్వామి స్టేడియం స్పిన్నర్లకు అనుకూలం కావడంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్, జడ్డూతో పాటు కుల్దీప్/ అక్షర్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. వైస్ కెప్టెన్ బుమ్రాతో కలిసి ఆకాశ్ దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

ఒత్తిడిలో కివీస్..

ఇక లంకకు టెస్టు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ పూర్తి ఒత్తిడిలో ఉంది. తొలి టెస్టుకు సీనియర్ విలియమ్సన్ దూరం కాగా.. తాజాగా పేసర్ బెన్ సీర్స్ గాయంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లను ఆడడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కివీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఏ మేరకు ఎదుర్కొంటారనేది చూడాలి. టామ్ లాథమ్, కాన్వే, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ కొంతమేర ప్రభావం చూపించనున్నారు. సౌథీ పేస్ విభాగం నడిపించనున్నాడు.