ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్‌లో ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్‌కు ఎప్పుడూ ఓ సమర మే. లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం ఓ భారీ కసరత్త్తు. భద్రతా సిబ్బందితో పాటుగా పోలింగ్ సిబ్బం దిని సన్నద్ధం చేయడంతో పాటు పోలింగ్ నిర్వహణ ఎన్నికల కమిషన్‌కు కత్తిమీద సామే. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కొంతకాలం లోక్‌సభతో పాటే రాష్ట్ర శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉండేవి. అయితే ఇందిరాగాంధీ ఈ సంప్రదాయానికి భిన్నంగా గడువుకన్నా 13 నెలలు ముందుగానే లోక్‌సభకు మధ్యతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
అదే సమయంలో 1960 దశకంలో వివిధ కారణాల వల్ల పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పతనం కావడంతో మధ్యతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఫలితంగా లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరిగే రాష్ట్రా ల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.1970 దశకంనుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగనే లేదు. నిజానికి 1983లోనే ఎన్నికల కమిషన్ జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చింది.1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై ఒక నివేదిక సమర్పించింది. 2018లో జమిలి ఎన్నికలపై అది ఓ నివేదికను సైతం విడుదల చేసింది.
అయితే 1990 దశకంలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతి పాదన కూడా బలపడుతూ వస్తోంది. 2019 నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ దేశమంతటా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వా త 2023 సెప్టెంబర్ 1న మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’పై కమిటీ ఏర్పాటయింది. అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలతో చర్చించిన ఈ కమిటీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదికను రాష్ట్రపతికి అందజేసింది.
తాజాగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమిలి ఎన్నికల నివేదికకు ఆమోదముద్ర వేయడంతో పాటుగా వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబం ధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటుగా పలు విపక్షాలు జమిలి ఎన్నికల నిర్వహణ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల వల్ల లాభమా, నష్టమా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుందనేది ఎన్నికల కమిషన్‌తో పాటుగా ప్రభుత్వ వర్గాల వాదన. అంతేకాకుండా రాష్ట్రాల్లో తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి రావడం వల్ల రోజువారీ పరిపాలనా విధులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందనేది ప్రభుత్వ వర్గాల వాదన. అయితే రాష్ట్రాల్లో దశాబ్దాల కాలంగా వేళ్లూనుకున్న ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకు కారణాలూ లేకపోలేదు. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలు ప్రాధాన్యత వహించి ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనేది ఆ పార్టీల భయం.అంతేకాదు,ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రాంతీయ సమస్యలు మరుగున పడతాయనేది ఆ పార్ట్టీల వాదన.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టే ప్రమాదంలేకపోలేదన్నది వాటి భయం. ఇక జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు చట్టంలో మార్పులు చేయడంతో పాటు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మద్దతును కూడగట్టడం మోదీ సర్కార్‌కు అంత సులువు కాదు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల శాసన సభల్లో సగానికి పైగా ఆమోదం తెలపాల్సి ఉంటుందిఇన్ని అడ్డంకులు దాటుకుని జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మోదీ సర్కార్ ఏం చేస్తుందో, ఎంతకాలం పడుతుందో చూడాలి మరి.