calender_icon.png 10 October, 2024 | 12:58 PM

సమరానికి సై

03-10-2024 12:00:00 AM

నేటి నుంచి మహిళల టీ20 ప్రపంచకప్

18 రోజుల పాటు అలరించనున్న క్రీడా సంగ్రామం

పురుషుల టీ20 ప్రపంచకప్ జరిగి మూడు నెలలు ముగియకముందే మరో మహా సంగ్రామానికి తెర లేచింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచి 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. పురుషులతో సమాన హోదా దక్కిన తర్వాత మహిళల ఆట క్రమేపీ పూర్తిగా మారిపోయింది.

మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు భారత జట్టు ఒక్కసారి ఐసీసీ ట్రోఫీ గెలవనప్పటికీ.. కొన్నాళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అంచనాలను పెంచేసింది. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తుది మెట్టుపై బోల్తా పడిన అమ్మాయిల జట్టు ఈసారి మాత్రం ఎలాగైనా కప్ ఒడిసిపట్టాలని భావిస్తోంది. అంచనాలను నిజం చేస్తూ యూఏఈ గడ్డపై ప్రపంచ చాంపియన్‌గా నిలవాలని ఆశిద్దాం..

దుబాయ్: మహిళల క్రికెట్‌లో అతిపెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే మహిళల టీ20 ప్రపంచకప్‌కు నేటి నుంచి తేరలేవనుంది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 20 వరకు 18 రోజుల పాటు అభిమానులను విశేషంగా అలరించనున్న మహా సంగ్రామంలో ఈసారి చాంపియన్ అయ్యేదెవరన్నది ఆసక్తిగా మారింది.

వాస్తవానికి ఈ టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ఆ దేశంలో ఏర్పడ్డ అల్లర్ల కారణంగా ఆగస్టులో మెగా టోర్నీని యూఏఈకి తరలిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లాదేశ్‌కు ఆతిథ్య హోదాను ఇచ్చింది. టోర్నీలో 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి.

గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లు ఉన్నాయి. షార్జా, దుబాయ్ వేదికగా అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగాటోర్నీలో భాగంగా తొలి రోజే డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తొలి మ్యాచ్‌లో గ్రూప్-బి నుంచి ఆతిథ్య బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీమిండియా ఈసారైనా

ఈసారి జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బలమైన జట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన అమ్మాయిల బృందం జోరు మీద ఉంది. దుబాయ్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.

అయితే రెండు నెలలుగా హర్మన్ సేన క్రికెట్ ఆడకపోవడం మైనస్‌గా మారింది. జూలైలో ఆసియా కప్ ఫైనల్ మన జట్టుకు చివరి మ్యాచ్. ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. కానీ ఎన్‌సీఏ అకాడమీలో ఏర్పాటు చేసిన సుదీర్ఘ సన్నాహక శిబిరంలో మన ఆటగాళ్లు బాగానే సాధన చేశారు. చాంపియన్ అయ్యేందుకు అన్ని వనరులు భారత్‌కు ఉన్నాయి.

మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన జట్టుకు కొండంత బలం. ఇక మిడిలార్డర్‌లో దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టచ్‌లో ఉండడం సానుకూలాంశం. ఇక హార్డ్ హిట్టర్‌గా పేరు పొందిన రిచా ఘోష్ రూపంలో భారత్‌కు మంచి ఫినిషర్ ఉంది.

బౌలింగ్ పరంగా కూడా భారత్ బాగానే ఫుంజుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు రాధ యాదవ్, ఆశా శోభన, శ్రేయాంకలతో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఇక పేస్ విభాగంలో రేణుకా సింగ్ కొత్త బంతితో రాణించడం భారత్‌కు కీలకం. పూజా వస్త్రాకర్‌తో పాటు తెలుగమ్మాయి అరుంధతీ రెడ్డి ఇటీవల కాలంలో బాగా రాణిస్తున్నారు.

ఇక 2009లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2023లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ సెమీస్ వరకు రాగలిగింది.

ఈ రెండు ప్రదర్శనలు భారత మహిళల క్రికెట్‌లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అయితే గ్రూప్-ఏలో ఉన్న భారత్.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కనీసం మూడింటిలో నెగ్గితేనే సెమీస్ బెర్తు ఖరారు అవుతుంది. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్ సొంతం. ఈ ఏడాది ఆసియా కప్ ఫైనల్లో చతికిలపడిన హర్మన్ బృందం సవాళ్లను అధిగమించి విజేతగా నిలుస్తుందా అన్నది చూడాలి.

ఆస్ట్రేలియా ఆధిపత్యం..

ఫార్మాట్ ఏదైనా క్రికెట్‌లో ఆధిపత్యం మాత్రం ఆస్ట్రేలియాదే. అటు పురుషుల క్రికెట్‌లో కావొచ్చు.. ఇటు మహిళల క్రికెట్ ఏదైనా కంగారూలు చాంపియన్‌గా నిలవందే ఊరుకోరు. పురుషుల క్రికెట్‌లో ఆసీస్ ఆధిపత్యం ఎంతలా ఉందో మహిళల క్రికెట్‌లోనూ అంతే స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది.

ఇప్పటిదాకా ఎనిమిదిసార్లు మహిళల టీ20 ప్రపంచకప్‌లు జరగ్గా.. అందులో ఆరుసార్లు చాంపియన్‌గా నిలవడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాను ఆపడం శక్తికి మించిన పనే. ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2016) ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.

టోర్నీలో 10 జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విడిపోయిన ఐదు జట్లు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. రెండు గ్రూపుల్లో నుంచి టాప్‌ఛౌ నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్, అక్టోబర్ 18న రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక అక్టోబర్ 20న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.