24-03-2025 10:13:37 PM
వసూళ్లకు ఎగబడుతున్న ఎమ్మెల్యే..
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): భారతదేశంలో జిఎస్టి లాగా మంచిర్యాలలో పి ఎస్ టి (ప్రేమ్ సాగర్ రావు టాక్స్) వసూలు చేస్తున్నారని మంచిర్యాల మాజీ శాసన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి మంచి మంచిర్యాల నేడు వసూలు మంచిర్యాలగా మారినందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వసూళ్ల పర్వం రోజురోజుకు పెరుగుతుందని, మంచిర్యాల ఉమర్ మియా సొసైటీలో ఇంటికి రూ. 6 లక్షలు, కలెక్టర్ ఆఫీస్ వద్ద 2023, డిసెంబర్ లో కూల కొట్టిన ఇండ్లు నేడు మరల కడుతున్నారు.
అక్కడ కోట్లాది రూపాయలు వసూళ్లు చేశారని, మంచిర్యాల వ్యాపారస్తుల దగ్గర దాదాపు 40 లక్షల రూపాయలు, ఒక దుకాణం యజమాని బిల్డింగ్ కూలగొట్టకుండ ఉండడానికి 10 లక్షల రూపాయలు, మరొ బిల్డింగ్ కూలకొట్టకుండా ఉండడానికి 50 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. లక్షెట్టిపేట, హాజీపూర్ మండలలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల దగ్గర కోట్లాది రూపాయలు, ఇటిక్యాల చెరువు ఎఫ్ టి ఎల్ పరిధి అనే నెపంతో రెండు కోట్ల రూపాయలు అడుగగా సగం ముట్టాయని, ఇంకా సగం ముట్టేది ఉందన్నారు. ఈ విషయంలో డబ్బులు ఇచ్చి మోసపోకండనీ, మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఎఫ్ టి ఎల్ భూమి పట్టా భూమి కాదనేది ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంచిర్యాలలో భూములు కొనేవాళ్లు 100 సార్లు ఆలోచించి కొనాలని, కొంతమంది గుండాయిజంతో, రౌడీయిజంతో కబ్జాలు చేసి, దౌర్జన్యంగా బెదిరించి కొంతమంది అమాయక ప్రజల భూములు లాక్కుంటున్నారనీ, ఆ భూములను కొన్నట్టయితే భవిష్యత్తులో నష్టం జరుగుతుందన్నారు.
బైపాస్ రోడ్డులో గల ప్రభుత్వ, ప్రైవేటు భూములు, బెల్లంపల్లి చౌరస్తాలో ప్రైవేటు భూమి, ఉమర్ మియా సొసైటీ లే అవుట్ వర్క్ స్థలంలో, తిలక్ నగర్ ప్రభుత్వ భూమిలో కానీ, ప్రైవేట్ భూముల్లో కానీ, నస్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరుల ప్రభుత్వ భూమి కానీ, ప్రైవేట్ భూములలో కానీ ఎవరన్నా అనుమతులు లేకుండా కొనుగోలు చేసినా, కట్టడాలు కట్టినా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వాటిని కూలగొట్టే కార్యక్రమం ఉంటుందనీ హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ బిల్డింగును కూల కొట్టిన తర్వాత ఎంత ఇనుము, మెటీరియల్ అమ్మితే ఎంత డబ్బు వచ్చిందో దానిని కాంట్రాక్టర్ కి ఇచ్చే డబ్బు నుంచి మినహాయించాలనీ డిమాండ్ చేశారు. అసలు టెండర్ ప్రక్రియ అయిందా? అదేదీ లేకున్నా పేమెంట్ చేస్తే అధికారులపై కోర్టుకు పోక తప్పదనీ, వారి ఉద్యోగాలు కూడా పోవడం ఖాయం అన్నారు.
తప్పు రికార్డు చేసి ప్రభుత్వ సొమ్ముని ఈ రోజు ఒత్తిళ్లకు భయపడి అన్యాయంగా అక్రమంగా ఇస్తే భవిష్యత్తులో చిప్పకూడు తప్పదన్నారు. ఎక్సైజ్ అధికారులను పిలిపించి నాకు అర్జెంటుగా 10 లక్షల రూపాయలు కావాలని అడిగితే ప్రతి దుకాణం నుంచి రూ. 25 వేలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి కావాలని అందరిని పిలిపించి అడిగి డబ్బులు ఇచ్చిన అధికారిపై ఉన్నత అధికారులకు రిపోర్ట్ చేస్తున్నామన్నారు. చివరికి స్మశానసవాటిక మెయింటనెన్స్ కు మార్వాడి, వైశ్య సోదరులు, బంగారు దుకాణదారుల నుంచి నెలకు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పడంతో వారు భయభ్రాంతులకు గురై ఒప్పుకున్నారని, ఆ డబ్బులు అతని జేబులోకి పోతుందని, ఒక దిక్కు దీనిని మెయింటెనెన్స్ చేయాలని మున్సిపల్ అధికారులకు చెప్పి, స్మశాన వాటిక పేరు వాడుకొని కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే ఎమ్మెల్యే ఎంత దిగజారిండోనని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని వారికి గంజాయి అలవాటు చేసి వారితో దాడులు, బెదిరింపులు, చేసినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ వారు తప్పు చేసిన వారిపై, ఎమ్మెల్యే అనుచరులపై కఠినంగా శిక్షించకపోవడం వలన అతనికి అందరూ భయపడి డబ్బులు ఇచ్చే కార్యక్రమము, దుకాణాలు కూల కొట్టే కార్యక్రమం, వివాదంలో ఉన్న భూమిని సగం సగం చేసుకునే కార్యక్రమము జరుగుతుందని, దీనికి పూర్తిగా మంచిర్యాల నియోజకవర్గ పోలీసులు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.