14-04-2025 12:00:00 AM
ఎస్జీటీల డిమాండ్, ధర్నా
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పదివేల ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్టుల మంజూరు ఉత్తర్వులను ఆమలు చేసి, అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతులు కల్పించాలని ఎస్జీటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరికెల వెంకటేశం డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో ఆదివారం ఎస్జీటీలు పలు డిమాండ్లపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన వారికి వెంటనే స్థానికతను కేటాయించాలని, ఐదు డీఏలు, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెరుగైన ఆరోగ్య విధానంతో ఉద్యో, ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు.