19-04-2025 08:12:38 PM
సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న...
క్రాంతినగర్ లో ఘనంగా పోషణపక్షం కార్యక్రమం..
కాలినడకన వెళ్లి పాల్గొన్న సీడీపీఓ లక్ష్మి ప్రసన్న, సూపర్ వైజర్ శారదా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పిల్లల శారీరక,మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని పాల్వంచ ఐసీడీఎస్ సిడిపిఒ లక్ష్మీ ప్రసన్న అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ ప్రాజెక్టు, రేగళ్ల సెక్టార్ గంగమ్మకాలనీ, క్రాంతినగర్ అంగన్‌వాడి కేంద్రం టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీడీపీఓ లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ... పోషణ పక్వాడా కార్యక్రమాలు ప్రతి అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని పిల్లలు వయసుకు తగిన బరువు బరువుకు తగిన ఎత్తు లేకపోవడం వలన కలిగే నష్టాల గురించి వివరించారు. పిల్లల్లో పోషణ లోపాన్ని అధిగమించడానికి బాలామృతం ఎంతగానో ఉపయోగపడుతుందని, గర్భిణీలు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలని, పుట్టిన గంటలోపు ముర్రుపాలు పిల్లలకు తాగించాలన్నారు.
నిత్యజీవితంలో మిల్లెట్స్ ప్రాముఖ్యత గురించి తెలియచేసి మహిళలు, గర్బిణులు పోషక విలువతో కూడిన ఆకుకూరలు, చిరుధాన్యాలు,పండ్లు తీసుకోవాలన్నారు.గర్బిణులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చునన్నారు. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం ఎంపికలను ప్రోత్సహించాలని స్థానికంగా ఇప్ప పువ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వాటిని కూడ తమ ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారికి సూచించారు.అనంతరం అంగన్వాడీ సెంటర్ ద్వారా అందుతున్న సదుపాయాలు, పౌష్టికాహార సరుకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు చేసి, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరభ్యాసం చేయించారు.
ఎంతో విన్నా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న తాను ఇక్కడికి,రాకముందు రేగళ్ల పరిధిలోని క్రాంతి నగర్ అంగన్వాడి గురించి ఎంతో విన్నానని గతంలో ఈప్రాంతం ఎలా ఉండేది ఇక్కడ అంగన్వాడి కేంద్రం ఏర్పడిన తర్వాత టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో ఎంతగా అభివృద్ధి చెందిందన్న విషయాన్ని తాను పేపర్లలో చదివానని, హైదరాబాద్లో కూడా ట్రైనింగ్ సమయంలో క్రాంతినగర్ ప్రస్తావన వచ్చిందన్న ఆమె నేడు ఇదే ప్రాంతానికి సిడిపిఓగా వచ్చి ఇక్కడ ప్రజల్లో వచ్చిన మార్పుని ప్రత్యక్షంగా చూస్తున్నానని ఎంతో శ్రమకోర్చి అంగన్వాడి టీచర్ జ్యోతి వీరితో మమేకమైన తీరుని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.