25-03-2025 01:58:13 AM
వర్షాలు సంవృద్ధిగా కురిసినా... తాగునీటికి కటకట
ప్రత్యేక శాఖ ఉన్నా...అధికారుల పట్టింపేది?
మార్నింగ్ వాక్‌లో రాచాల యుగంధర్‌గౌడ్
వనపర్తి, మార్చి 24 ( విజయక్రాంతి) : ఏదుల మండలంలో కనీస సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏదుల మండల కేంద్రంలో నిర్వహించిన రాచాల మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం లోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 164 మంది విద్యార్థులు ఉన్నారని, తరగతి గదులు మాత్రం రెండే ఉండటంతోశిధిలావస్థలో ఉన్న భవనాల్లోనే విద్యను అభ్యసిస్తున్నారన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు త్వరితగతిన నూతన భవనాలను నిర్మించడంతో పాటు ఒక బోర్ వేయించి, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని కోరారు. స్థానికంగా గతంలో ఉన్న బస్సు షెల్టర్ రోడ్డు విస్తరణలో పోవడంతో ప్రస్తుతం ప్రయాణికులకు షెల్టర్ లేకుండా పోయిందని, కావున ప్రయాణికుల సౌకర్యార్థం ఒక బస్టాండ్ నిర్మించాలన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, మిషన్ భగీరథ నీరు వారానికోసారి కూడా రాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్టానిక ప్రజలు రాచాలతో మొరపెట్టుకున్నారు.
దీనిపై స్పందించిన రాచాల ఈ ఏడాది వర్షాలు సంవృద్దిగా కురిసినా అధికారుల సరైన ప్రణాళిక లేని కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, తాగునీటి కోసం ప్రత్యేక శాఖ ఉన్న కూడా అధికారుల పట్టింపేది అని మండిపడ్డారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మశన్న, బీసీ పొలిటికల్ జెఎసి మండల అధ్యక్షుడు గువ్వల హనుమంతు, ప్రధాన కార్యదర్శి జానకిరామ్, పరశురాం, జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.