10-03-2025 01:39:09 AM
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి, మార్చి 9 ( విజయక్రాంతి): మదనాపూర్ మండల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టామన్నారు.
పూర్వం రెండ వ బొంబాయిగా ప్రసిద్ధి గాంచిన మదనాపూర్ నేడు కనీస సౌకర్యాలకు కూడా నోచు కోకపోవడం బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు. మండలంలో జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఊకచెట్టు వాగుపై బ్రిడ్జి నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో వచ్చే వర్షాకాలం ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి రైల్వే స్టేషన్లో చాలవరకు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగడం లేదని, ఈవిషయమై ఎన్నో సార్లు రైల్వే అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఏ ప్రయోజనం లేకుండా పోయిందని, ఈవిషయంపై స్థానిక ఎంపీ దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడి అన్ని రైళ్లు ఆగేలా కృషి చేయాలన్నారు.
మండల కేంద్రంలో ప్రత్యేకంగా సంతకు స్థలం కేటాయించకపోవడంతో రోడ్డుమీదనే అమ్మకాలు సాగిస్తు న్నారని, దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, సంత జరిగే సోమవారం రోజు బస్సులు లోపలికి వచ్చే అవకాశం లేకవడంతో బయట నుంచే వెళుతున్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంతకు ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని, మార్కెట్ యార్డు స్థలం చాలా వరకు కబ్జాకు గురైందని, సరిహద్దుకు వెంటనే కంచె ఏర్పాటు చేసి కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏనుకుంట రిజర్వాయర్ కింద చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, కాలువ మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ర్ట కార్యదర్శి వివి గౌడ్, మండల అధ్యక్షులు మహేందర్ నాయుడు, కన్వీనర్ నరసింహ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కొన్నూరు గూడూషా, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ స్వప్న యాదవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ రజక, నారాయణ పేట జిల్లా అధ్యక్షులు చిట్యాల లక్ష్మణ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు దేవర శివ,
పెద్దమందడి మండల అధ్యక్షులు రమేష్ సాగర్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు నాగరాజు యాదవ్, ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్, అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తెలుగు నాగరాజు,పెబ్బేరు గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మ్యాదరి రాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.