భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ జితేష్వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కిన్నెరసాని ప్రాజెక్టు పార్కులో చేయవలసిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించవలసిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పార్క్ నందు పిల్లలు ఆడుకోవడానికి జారుడుబండ వెదురుతో నీడ సౌకర్యం, బోటింగ్, బాత్రూంలు ఏర్పాటు,మంచినీటి సౌకర్యం కల్పించాలని, పర్యాటకులకు భోజనాలు చేయడానికి కోతులు ఇబ్బంది లేకుండా షెడ్డు చుట్టూ మెస్ ఏర్పాటు చేయాలని సూచించారు.
డ్వాక్రా సంఘాలతో క్యాంటీన్ ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో స్నాక్స్ టిఫిన్లు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా బెలగా మారేడు కరక్కాయ మేడి అల్లనేరేడు బంకనకేరు తాండ్ర వంటి మొక్కలు వరుస క్రమంలో నాటాలని ఉపాధి హామీ పథకం ద్వారా పెరుకులేషన్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. భేటీకి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు వారం రోజుల్లో పంపించాలని అటవీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, తహసిల్దార్ వివేక్, ఎంపీ ఓ నారాయణ, ఎ ఇ సురేష్ ,సెక్షన్ ఆఫీసర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.