02-04-2025 12:43:39 AM
కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయకు బండి సంజయ్ విజ్ఝప్తి
మాజీ మేయర్ సునీల్ రావు, శాతవాహన వర్శిటీ వీసీతో కలిసి కేంద్ర మంత్రిని కలిసి సంజయ్
కరీంనగర్ , ఏప్రిల్1(విజయక్రాంతి): ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కోరారు.
అంశంపై ఢిల్లీకి విచ్చేసిన కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, శాతవాహన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ లతో కలిసి బండి సంజయ్ కేంద్ర మంత్రి మాండవీయను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ “తెలంగాణలోని అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన కరీంనగర్ విద్య, క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందులో భాగంగా కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలతోపాటు ఇతర విద్యాసంస్థలున్నాయన్నారు.
ముఖ్యంగా క్రీడల్లో కరీంనగర్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్జున అవార్డు గ్రహీత మడాసు శ్రీనివాసరావు కరీంనగర్కు చెందినవారే. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఖేలో ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం అభివ్రుద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సునీల్ రావుతో కలిసి అంబేద్కర్ స్టేడియంలోని క్రీడా సదుపాయాలను వివరించారు. తద్వారా కరీంనగర్ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసి దేశానికి గౌరవం తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు.