calender_icon.png 17 January, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై వివరాలివ్వండి

07-08-2024 03:12:04 AM

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు తదితర వివరాలను ఈ నెల 27లోగా సమర్పించాలని ఆదేశించింది.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 5ను సవాలు చేస్తూ జాజుల శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2010లో కృష్ణమూర్తి కేసులో తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక, సామాజిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకోరాదని, కేవలం రాజకీయ వెనుకబాటుతనాన్ని మాత్రమే తీసుకోవాలని అన్నారు.

ఇందుకోసం అధ్యయనం జరగాల్సి ఉందని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం బీసీల పరిస్థితులపై అధ్యయనానికి తీసుకున్న చర్యలపై వివరాలు సమర్పించాలని ఆదేశించి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.