10-04-2025 11:48:18 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆయుష్ వైద్యులు, ప్రధానమంత్రి జన్ మన్ వైద్య సిబ్బంది, సూపర్ వైజర్లతో వైద్య ఆరోగ్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలు, పీవీటీజీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నారని, ఎలాంటి కొరత లేదని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సత్వర చికిత్స అందించినప్పుడే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించినట్లుగా భావించడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, సమయపాలన పాటిస్తూ విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది అధికంగా ఉన్నట్లయితే సిబ్బంది కొరత ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సర్దుబాటు చేయాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, వడ దెబ్బకు గురికాకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, పంచాయితీ కార్యదర్శుల వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాలు, పి వి టి జి లు నివసించే ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలని తెలిపారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.